క్రికెట్ లో ఒక్కోసారి బాగా ఆడినా కూడా సీన్ రివర్స్ అవుతుంటుంది. ఒకప్పుడు ఆ విమర్శ ‘క్రికెట్’ దేవుడు సచిన్ తలుపు తట్టగా, ప్రస్తుతం అది రోహిత్ శర్మ చెంతకు చేరింది. సచిన్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఓడిపోతుందని క్రికెట్ అంటే అవగాహన లేని వారు కూడా వ్యాఖ్యానించడం పరిపాటిగా మారిన విషయం తెలిసిందే. అయితే సచిన్ చేసిన మొత్తం సెంచరీలలో భారత జట్టు విజయాలు 90 శాతం పైనే ఉన్నాయన్న విషయం గణాంకాలను పరిశీలించే వారికి మాత్రమే తెలిసే అంశం.
తాజాగా రోహిత్ శర్మపై కూడా ఇదే అపవాదు పడుతోంది. తొలి రెండు మ్యాచ్ లలో రెండు సెంచరీలు చేసి ఆస్ట్రేలియా జట్టుకు చుక్కలు చూపుతున్న రోహిత్ శర్మ సెంచరీ చేస్తే మ్యాచ్ ఓడిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. 11 మంది గెలుపు కోసం ప్రయత్నించే ఈ ఆటలో ఒక వ్యక్తి ప్రదర్శన మిగిలిన 10 మంది ఆటతీరును మించేలా ఉంది అంటే, అది ఆడిన ఒక్కరి తప్పు కాదు, మిగిలిన వారి ప్రతిభను ప్రశ్నార్ధకం చేసేదని గమనించాలి.
అవగాహన లేని కొందరు చేసే ఈ దుష్ప్రచారానికి సెంటిమెంట్స్ ను జోడిస్తున్నారు. మరి ఇదే రోహిత్ శర్మ వరుసగా విఫలమై, టీమిండియా విజయాలు సాధిస్తే, అలాగే టీంలో కొనసాగించలంటారా? ఎందుకంటే రోహిత్ విఫలమైతే మ్యాచ్ లు గెలుస్తున్నాయి కదా! అర్ధం లేని వాదనలు తెరపైకి తెచ్చి, అద్భుత ప్రదర్శన ఇస్తున్న రోహిత్ లాంటి వారిని ఈ వర్గం తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్నారు.





