“ఆర్ఆర్ఆర్” ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ముంబై, బెంగుళూర్, చెన్నై మరియు హైదరాబాద్ లలో ప్రెస్ మీట్ లను నిర్వహించారు. ముంబైకి రామ్ చరణ్ మిస్ కాగా, మిగిలిన అన్ని ఈవెంట్స్ లో ఇద్దరు హీరోలు, హీరోయిన్ అలియా, దర్శకుడు రాజమౌళి మరియు నిర్మాత దానయ్యలు పాల్గొన్నారు.
ఈ మొత్తం నాలుగు ప్రెస్ మీట్స్ లలో జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ లు హైలైట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా ఇతర భాషలపై జూనియర్ ఎన్టీఆర్ కున్న పట్టు ఈ సందర్భంగా బయట ప్రపంచానికి తెలిసి వచ్చినట్లయ్యింది. ప్రతి ఏరియాలో ప్రాంతీయ భాష మాట్లాడడం వలనే తారక్ కు ఇంత గుర్తింపు సొంతమైంది.
తాను దర్శకత్వం వహించే సినిమాలను ప్రేక్షకులలోకి ఎలా తీసుకువెళ్లాలో తెలిసిన జక్కన్న, ప్రెస్ మీట్ లలో ఆయనే హైలైట్ అవుతుంటారు. కానీ “ఆర్ఆర్ఆర్” విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తన వాక్చాత్యుర్యంతో అందరినీ ఫ్లాట్ చేసారు. తారక్ ఫ్యాన్స్ లో ఇదో కొత్త జోష్ ను నింపుతోంది.
ఈ నాలుగు భాషలలో కూడా జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లే “ఆర్ఆర్ఆర్” సినిమాకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. కానీ పబ్లిక్ ఈవెంట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడినంత అనర్గళంగా రామ్ చరణ్ స్పందించలేకపోవడం గమనించదగినదే.
దీంతో తారక్ ఫ్యాన్స్ తమ హీరో మాట్లాడిన నాలుగు భాషలలోని ప్రెస్ మీట్ లో హైలైట్స్ ని కట్ చేసి వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇదే ఒరవడి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లలో కొనసాగితే, ఇతర భాషల మార్కెట్ ను దక్కించుకోవడంలో తారక్ కి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.



