తెలుగు నాట మరో “ఇండస్ట్రీ హిట్” ఖరారైంది. ఇప్పటివరకు ఏ సినిమా విజయం సాధించినా, అది “నాన్ బాహుబలి” హిట్ గా ట్రేడ్ వర్గాలు కీర్తించాయి. ఇక దీనికి కాలం చెల్లింది. నేటి నుండి “నాన్ ఆర్ఆర్ఆర్” రికార్డులుగా పేర్కొనే విధంగా ఓపెనింగ్స్ ఉండబోతున్నాయి. ప్రతి షో, ప్రతి ధియేటర్ ‘హౌస్ ఫుల్’ బోర్డులతో కళకళలాడిపోతున్నాయి.
అభిమానుల కోలాహాలం నడుమ విడుదలైన “ఆర్ఆర్ఆర్” సినిమాకు ప్రేక్షకుల మాట కంటే కూడా, సినీ విశ్లేషకులే అద్భుతమైన రివ్యూలతో స్వాగతం పలికారు. దీంతో ‘బ్లాక్ బస్టర్ కా బాప్’ అన్న టాక్ ను “ఆర్ఆర్ఆర్” సొంతం చేసుకుంది. ఇద్దరు హీరోలు సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన విధానం, ప్రదర్శించిన అభినయం వారి వారి కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోనుంది.
జూనియర్ ఎన్టీఆర్ అభినయం గురించి అందరికి తెలిసిన విషయమే. ఎలాంటి సన్నివేశాన్ని అయినా తన హావభావాలతో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేయగల సత్తా తారక్ సొంతం. అలాంటి తారక్ కు ‘కొమరం భీమ్’ లాంటి పవర్ ఫుల్ పాత్ర దొరికితే, ఏ విధంగా చెలరేగిపోతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా భీమ్ పాత్రను పండించిన ఘనత తారక్ సొంతం.
ఇక “ఆర్ఆర్ఆర్”లో స్పెషల్ గా పేర్కొనాల్సింది రామ్ చరణ్ నటన గురించే. మాస్ ఇమేజ్ కలిగిన హీరోగా చెర్రీకి అద్భుతమైన క్రేజ్ ఉన్న మాట వాస్తవమే గానీ, నటుడిగా ఇంకా చాలా పరిణితి చెందాలన్న విమర్శలను “ఆర్ఆర్ఆర్”తో పూర్తిగా తుడిచిపెట్టేసాడు. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో జీవించిన విధానం వీక్షకులను ఆశ్చర్యపరుస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
రిలీజ్ కు ముందు ఈ ఇద్దరు హీరోల గురించి రాజమౌళి ఓ విషయం చెప్పారు. తారక్ కు తన బలం, బలహీనత ఏమిటో తెలుసని, కానీ రామ్ చరణ్ హనుమంతుడి లాంటి వాడని, తన బలం ఏమిటో తనకు తెలియదని, కానీ ఒక్కసారి పక్కన వాళ్ళు తన బలం గురించి చెప్తే ఏ స్థాయిలో ఉంటుందో, అలా “ఆర్ఆర్ఆర్”లో రామ్ చరణ్ నటించారని చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలు అక్షర సత్యాలని పేర్కొనే విధంగా “ఆర్ఆర్ఆర్”లో ఇద్దరి హీరోల అభినయానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రాజమౌళిని ‘మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్’గా సినీ ఇండస్ట్రీ ఎందుకు కీర్తిస్తుందో మరోసారి నిరూపించుకునే విధంగా “ఆర్ఆర్ఆర్”ను తీర్చిదిద్దారు. “జక్కన్న మూవీ అంటే ఇండస్ట్రీ షేక్ అయిపోవాల్సిందే” అనే విధంగా ‘ఆర్ఆర్ఆర్’ మరో నిదర్శనంగా నిలిచింది.
తెలుగునాట మొదటి రోజు అన్ని ధియేటర్లు, అన్ని షోలు ‘హౌస్ ఫుల్స్’ కావడంతో, అప్పుడే రికార్డు కలెక్షన్స్ ను లెక్కించే పనిలో ట్రేడ్ వర్గాలు ఉన్నాయి. పెరిగిన టికెట్ ధరలు “ఆర్ఆర్ఆర్”కు ఎంతో కలిసి వచ్చే అంశంగా మారింది. ఎందుకంటే ‘బాహుబలి 2’ని భారీ మార్జిన్ తో దాటిపోయే విధంగా ”ఆర్ఆర్ఆర్” మొదటి రోజు కలెక్షన్స్ ఉండబోతున్నాయి, ఇది ఫిక్స్!