ప్రకటించిన తేదీకి సినిమాను విడుదల చేయడం అనేది ప్రస్తుతం కత్తి మీద సాములా మారింది. ఏడాదిలో ఒకటో, రెండో సినిమాలు మాత్రమే అనుకున్న తేదీకి విడుదలవుతున్నాయి. మిగతావన్నీ వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తూ… ప్రేక్షకులు మరియు అభిమానుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఈ కోవలోనే తాజాగా ప్రతిష్టాత్మక “రోబో 2.0” కూడా చేరిపోయిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
దుబాయ్ లో ఎంతో అట్టహాసంగా విడుదల చేసిన ఈ సినిమా ఆడియో వేడుకతో ఒక్కసారిగా ‘రోబో 2.0’ అంశం మోత మోగింది. అయితే అది ముగిసిన రెండు రోజులకే ఈ సినిమా మళ్ళీ వాయిదా పడిందనే వార్త హల్చల్ చేస్తోంది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం 2018, జనవరి 26వ తేదీన విడుదల కావాల్సి ఉండగా, ప్రస్తుతం అది ఏప్రిల్ 13 లేక 14 వ తేదీకి వాయిదా పడిందని తెలుస్తోంది.
జనవరి 26న అక్షయ్ కుమార్ “పాడ్ మాన్” సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో, ‘రోబో 2.0’ వాయిదా పడిందనే వార్తలకు బలం చేకూరుతోంది. అయితే ఆరు నెలల ముందు ఆడియో విడుదల రిలీజ్ చేసుకున్న ఈ సినిమా, అప్పటివరకు ప్రేక్షకులలో ఆసక్తిని ఉంచగలుగుతుందా? అనేది సందేహమే. ఎంత ‘సూపర్ స్టార్’ మూవీ అయినా ఈ వాయిదాలు మాత్రం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాయి.


