సచిన్ చేతిలో బ్యాట్ ఉన్న సమయంలో తింటున్న ముద్దను కూడా ఆపేసి మరీ టీవీలను వీక్షించిన అభిమానుల సంఖ్యకు లెక్కే లేదు. ఇండియాలో క్రికెట్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందంటే అందుకు సచిన్ టెండూల్కర్ నింపిన స్ఫూర్తి ప్రధాన కారణమని చెప్పనవసరం లేదు. క్రికెట్ లో ఒక ‘ఎవరెస్ట్’ను ఏర్పాటు చేసిన సచిన్, ఈ స్థాయికి రావడానికి ఎంతలా కష్టపడ్డారు? అన్న విషయం అతి కొద్ది మంది వారికి మాత్రమే తెలిసిన నిజం. అయితే రాహుల్ వంటి వారు ఒకటి రెండు సందర్భాలలో సచిన్ చిత్తశుద్ది గురించి కొన్ని కీలాక వ్యాఖ్యలు చేసారు.
రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ గా ఇంగ్లాండ్ పర్యటనలో జట్టు సభ్యులందరూ విశ్రాంతి తీసుకున్నా… ఆ సిరీస్ లో పెద్దగా రాణించకపోవడంతో అర్ధరాత్రి ఒంటి గంట వరకు సచిన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడని, ఆ ఫలితమే ఈ టెస్ట్ మ్యాచ్ లో కనపడిందని, ఆ మ్యాచ్ ముగిసిన అనంతరం సచిన్ చిత్తశుద్ది గురించి రాహుల్ వ్యాఖ్యానించడం అందరినీ కలచివేసింది. నిజానికి అప్పటికే క్రికెట్ లో అన్ని రికార్డులను సచిన్ చవిచూసాడు. అయినప్పటికీ ఇంకా జట్టుకు ఏదో చేయాలనే తపన సచిన్ లో అణువణువూ కనపడుతుందని అలనాటి మేటి క్రికెటర్ల నుండి ఈనాటి వర్ధమాన క్రికెటర్ల వరకు సచిన్ ను దేవుడిగా ఆరాధిస్తారు.
ఇలాంటి అనేక సన్నివేశాల సమాహారమే “సచిన్” నిజజీవితం. అలాంటి జీవితం సిల్వర్ స్క్రీన్ పై పడబోతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన సచిన్, ఈ సినిమా ఫస్ట్ టీజర్ సమయాన్ని కూడా చెప్పారు. దీంతో దేశమంతా ఈ టీజర్ కోసం ఎదురు చూపులు చూస్తోంది. ఏప్రిల్ 14, మధ్యాహ్నం ఒంటి గంటకు “సచిన్” (ఎ బిలియన్ డ్రీమ్స్) సినిమా టీజర్ విడుదల కాబోతుందని ట్వీట్ చేసారు. సచిన్ ట్వీట్ తో మొదలైన ఈ సినిమా హంగామాను సెహ్వాగ్, రైనా, రోహిత్ శర్మ వంటి వారు కొనసాగించారు.



