ఇకపై సంక్రాంతి సినీ ఫార్ములా ఇదేనా?

Sankranti Telugu movies theatrical release

సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు దిగాయి. వాటిలో ‘ది రాజాసాబ్’ ఒక్కటే బలమైన కధతో రాగా ‘మన శంకర వరప్రసాద్’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ఈరోజు సాయంత్రం విడుదల కాబోతున్న ‘నారీ నారీ నడుమ మురారీ’ కేవలం కామెడీతో ప్రేక్షకులను అలరిస్తే చాలనుకున్నాయి.

హర్రర్, కామెడీ, రొమాన్స్ , సోషియో ఫ్యాంటసీ… ఈ నాలుగు జోనర్లు దేనికవి తీసి మెప్పించడమే చాలా కష్టం. కానీ మారుతి హర్రర్, కామెడీలతో రొమాన్స్, సోషియో ఫ్యాంటసీలని కూడా మిక్స్ చేసి ‘రాజసాబ్’ని ప్రేక్షకుల ముందుంచారు.

ADVERTISEMENT

మన డార్లింగ్ చాలా కాలం తర్వాత కామెడీ, రొమాన్స్ చేస్తున్నారు… అదీ ముగ్గురు హీరోయిన్లతో. వీటికి బోనస్‌గా ‘హర్రర్’, ‘సోషియో ఫ్యాంటసీ’లు కూడా ఉన్నాయి. కనుక సంక్రాంతికి రాజాసాబ్ ఇస్తున్న ఈ ‘టూ ప్లస్ త్రీ ఆఫర్’ కోసం ప్రేక్షకులు క్యూకట్టారు.

కొబ్బరి చట్నీలో కొబ్బరి ముక్కలు నలగనట్లు ఈ హర్రర్, కామెడీ, రొమాన్స్, సోషియో ఫ్యాంటసీలు కూడా మిక్సీలో సరిగ్గా నలగలేదు. కానీ నలగక పోయినా దాని టేస్ట్ పది రోజులు ఆగితే తెలుస్తుందని మారుతి నమ్మకంగా చెపుతున్నారు. కొత్తావకాయ రుచి వేరు… పాత అవకాయ రుచి వేరేగా ఉంటుంది. కనుక మారుతి చెప్పినట్లు కాస్త ఓపిక పట్టక తప్పదు.

క్లిష్టమైన కధలతో సినిమాలు చేసి ఇలా టెన్షన్ పడటం కంటే పండుగకి అందరూ హాయిగా నవ్వుకునేలా చేసినా చాలు.. ప్రేక్షకులు కనకవర్షం కురిపిస్తారనే ఫార్ములా ఉండనే ఉంది. దానినే నమ్ముకొని తీసిన మిగిలిన మూడు సినిమాలు ఊహించినట్లే ఒడ్డున పడ్డాయి. నారీ నారీ నడుమ మురారీ’ టీజర్‌, ట్రైలర్‌లతోనే అందరినీ మెప్పించారు. కనుక ఈ సినిమా కూడా గట్టెక్కిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

సంక్రాంతికి వచ్చిన ఈ సినిమాలు చూసిన తర్వాత, ఇకపై ప్రతీ సంక్రాంతి పండుగ సీజన్‌కి ఈ ఫార్ములాతోనే సినిమాలు ఇస్తుంటారేమో? అనే సందేహం కలుగుతోంది.

పెద్ద నిర్మాణ సంస్థలు, పెద్ద హీరోలు, దర్శకులు ఇలాంటి సినిమాలతో సరిపెట్టుకుంటుంటే, కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్నవారు మంచి బలమైన కధ, స్క్రీన్ ప్లేతో మన భాష, యాస, సంస్కృతీ సంప్రదాయాలు, పండుగలు, పట్టణ, గ్రామీణ జీవితాలను ప్రతిబింబించే సినిమాలు తీసి మెప్పిస్తున్నారు.

అయితే సినీ పరిశ్రమలో ఈవిధంగా డివిజన్ ఉండటం అవసరమే. ప్రేక్షకులు తమ అభిరుచిని బట్టి నచ్చిన సినిమాలు చూసుకుంటారు. కనుక సంక్రాంతికి నాలుగు చిన్న సినిమాలు కూడా పడితే బాగుంటుంది.

ADVERTISEMENT
Latest Stories