మంత్రి సీదిరి డిసెంబర్‌ పాట మొదలెట్టేశారుగా?

Seediri Appalaraju

ఏపీ సిఎం జగన్‌ విశాఖ షిఫ్టింగ్ అన్నప్పుడల్లా వైసీపి మంత్రులు నిద్రలో కలవరించిన్నట్లు విశాఖ రాజధాని, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి, ప్రతిపక్షాల ఏడ్పులు అంటూ ఏదేదో మాట్లాడుతుంటారు. డిసెంబర్‌ ముహూర్తం దగ్గర పడుతుండటంతో మళ్ళీ వైసీపి మంత్రుల కలవరింతలు కూడా మొదలయ్యాయి.

ముందుగా మంత్రి సీదిరి అప్పలరాజు ఆ పాచిపాట మళ్ళీ అందుకొన్నారు. ఆంధ్రాలో ఆధార్ కార్డు కూడా లేనివాళ్ళకి ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలించాలో చెప్పే అర్హత ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే సిఎం క్యాంప్ కార్యాలయం అవుతుందని, అక్కడి నుంచే రాష్ట్ర పాలన సాగుతుందని, దీనిపై టిడిపి, జనసేనలకు ఎందుకు ఏడుపు? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి, ఉత్తరాంధ్రా జిల్లాలకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిసినా అచ్చన్నాయుడు తదితర టిడిపి నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

ADVERTISEMENT

సిఎం విశాఖ నుంచి పరిపాలన చేస్తే కలిగే లాభాల గురించి మంత్రిగారు ఏం చెప్పారంటే…

1. ఉత్తరాంధ్రా జిల్లాలకు పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు వస్తాయి. వాటితో యువతకు భారీగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుంది. కనుక యువత వలసలు తగ్గుతాయి.

2. ఉత్తరాంధ్రా జిల్లాలలో విద్యావకాశాలు పెరుగుతాయి. కనుక ఉన్నత చదువుల కోసం విద్యార్దులు ఎక్కడికో వెళ్ళనవసరం లేదు.

3. ఉత్తరాంధ్రా జిల్లాలలో ఆస్తుల విలువ పెరుగుతుంది.

4. మౌలిక వసతులు పెరుగుతాయి.

వైసీపి అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ళవుతోంది. ఇన్నేళ్ళలో ఉత్తరాంధ్రాలో పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, ఉన్నత విద్యాసంస్థలు, మౌలిక వసతులు ఏర్పాటు చేయవద్దని ఎవరైనా అడ్డుకొన్నారా?లేదు కదా? కానీ ఎందుకు చేయలేదు?చేయవలసిన చేయకుండా ప్రతిపక్షాలపై ఏడ్పులెందుకు?

విశాఖను రాజధాని చేయాలని నిజంగా ఆలోచన, నిబద్దత వైసీపికి ఉండి ఉంటే ముందుగా ఋషికొండపై భవనాలు నిర్మించుకొనే బదులు, నగరంలో రోడ్లు, ఫ్లైఓవర్లు, లైటింగ్, డ్రైనేజ్ వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసి ఉండాలి. కానీ అవేమీ చేయకుండా సిఎం వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పడం హాస్యాస్పదంగా లేదూ?

‘విశాఖకు పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు వాటిలో యువతకు ఉద్యోగాలు రావద్దా?’ అని అడుగుతున్న మంత్రి సీదిరి అప్పలరాజుకి, విశాఖలో ఐ‌టి కంపెనీల కోసం ప్రత్యేకంగా నిర్మించిన మిలీనియం టవర్స్‌నే ప్రభుత్వం కబ్జా చేసి దానిలో ఐ‌టి కంపెనీలకు చోటు లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలియదా?

ADVERTISEMENT
Latest Stories