ఒకప్పుడు తెలుగు సినిమా అంటే… స్టోరీతో సంబంధం లేని హీరో ఇంట్రడక్షన్ ఫైట్, వెంటనే ఓ సాంగ్… హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్… నాలుగు రొటీన్ పాటలు… క్లైమాక్స్ కు ముందు ఒక ఐటెమ్ సాంగ్… మధ్య మధ్యలో హీరో కొడితే రౌడీలు గాల్లో ఎగిరే విధంగా ఫైట్లు… కంటెంట్ తో నిమిత్తం లేకుండా సైడ్ ట్రాక్ లో రన్ అయ్యే కామెడీ..!
ఇది తెలుగు సినిమా గురించి తోటి రాష్ట్రాలతో పాటు, తెలుగు సినీ జనం కూడా ఓపెన్ గా మాట్లాడుకునే విషయాలు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? అంటే… దేశం మొత్తం టాలీవుడ్ వైపే చూస్తోంది. అవును… కధాబలంతో పాటు సరికొత్తగా ప్రేక్షకులకు అందిస్తోన్న కంటెంట్, ఇతర రాష్ట్రాల ట్రేడ్ వర్గాలను కూడా టాలీవుడ్ వైపుకు చూసేలా చేసింది.
ఇది ఒక్కసారిగా వచ్చిన పరివర్తనం కాదు. కొత్తదనాన్ని సరిగ్గా చెప్పగలిగితే ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారని క్రియేటివ్ దర్శకులు నమ్మడంతో, టాలీవుడ్ కొత్త పుంతలు తొక్కుతోంది. అలాగే సరికొత్త ఆలోచనలతో నవతరం దర్శకులు కొత్తగా మెగా ఫోన్స్ ను పట్టుకోవడం కూడా ఈ ట్రెండ్ కు మరో కారణం.
చాలామంది సినీ పెద్దలకే అర్ధం కానటువంటి ‘ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్’ వంటి సినిమాలను కూడా మన తెలుగు ప్రేక్షకులు ఆదరించారంటే కారణం ఇదే. అందుకే అగ్ర హీరోలు కూడా నేడు ప్రయోగాల బాట పడుతూ ప్రేక్షకులకు తమకు తామే సరికొత్తగా పరిచయం అవుతున్నారు. ఒకప్పుడు పెద్ద హీరోలు ప్రయోగం చేయడమంటే తమ చేతిని తాము కాల్చుకున్నట్లే!
కానీ ఇప్పుడు ప్రయోగాలు చేయకుండా రొటీన్ సినిమాలు చేస్తుంటే, అలాంటి అనుభూతి కలిగించేలా ప్రేక్షకులు మారిపోయారు. అందుకే తెలుగు సినిమా వెలిగిపోతోంది. తాజాగా విడుదలైన శర్వానంద్ “ఒకే ఒక జీవితం” టీజర్ కూడా అందుకు ఓ ఉదాహరణ. టైం ట్రావెలింగ్ తో హాలీవుడ్ లోనే సినిమాలు వస్తుంటాయి. మన తెలుగులో ‘ఆదిత్య 369’ తర్వాత ఒక పేరున్న హీరో అయితే ఎవరూ చేయలేదు.
ఇటీవల ఓటీటీలో ‘ప్లే బ్యాక్’ మరియు ‘అద్భుతం’ సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ‘ఒకే ఒక జీవితం’ సిల్వర్ స్క్రీన్ పై పయనించడానికి సిద్ధమవుతోంది. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ టీజర్ ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకువెళుతోంది. మొదటి సినిమా అయినా ప్రొడక్షన్ వాల్యూస్ లో డ్రీం వారియర్ పిక్చర్స్ ఏ మాత్రం రాజీ పడలేదని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది.
ఇలాంటి సరికొత్త సినిమాలు ప్రేక్షకులు చూసి వినోదంగా భావించాలంటే ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు తోడ్పాటు అందివ్వాలి గానీ, ఒక మెట్టు కిందకి జార్చే విధంగా ఉండరాదు. నిర్మాణ వ్యయానికి లెక్క చేయకుండా ఇలాంటి సినిమాలు రావాలంటే, టాలీవుడ్ వర్గీయులను మరింతగా ప్రోత్సహించేలా పరిణామాలు ఉండాలి గానీ, రిలీజ్ కు సినిమా రెడీగా ఉన్నా, ‘ఎందుకు రిలీజ్ చేస్తున్నాము?’ అన్న ఆలోచనలు నిర్మాతలకు వస్తే, ఇంకా కొత్తదనానికి చోటెక్కడ ఉంటుంది?



