నాని హీరోగా నటించిన “శ్యామ్ సింగ రాయ్” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ‘ఈ క్రిస్మస్ మనదే’ అంటూ పూర్తి స్థాయిలో నాని ప్రకటించిన ఆత్మ విశ్వాసానికి తగ్గట్లుగానే సినిమా టాక్ వచ్చిందా? అంటే, సినిమా మొత్తానికి కాదేమో గానీ, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ‘శ్యామ్ సింగ రాయ్’ ఎపిసోడ్ కు మాత్రం యూనివర్సల్ టాక్ లభించింది.
ఇంటర్వెల్ ముందు వరకు స్లోగా సాగిన సినిమా, విరామం తర్వాత వచ్చిన టైటిల్ ఎంట్రీ ఎపిసోడ్ బాగా హైలైట్ అయ్యింది. టెంపుల్ దగ్గర వచ్చిన ఫైట్, ‘శ్యామ్ సింగ రాయ్’గా నాని అభినయం సినిమాను నిలబెట్టగా, సాయిపల్లవి నృత్యం సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా పండింది. ఈ ఎపిసోడ్ లో వచ్చే డైలాగ్స్, డైరెక్టర్ టేకింగ్ అన్ని కూడా ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి.
ఇక ఓవరాల్ గా ‘శ్యామ్ సింగ రాయ్’ క్లాస్ ప్రేక్షకులకు చేరువయ్యే సినిమాగా టాక్ తెచ్చుకోగా, కలెక్షన్ల రూపంలో ప్రేక్షకుల తీర్పు ఎలా ఉందో తెలియాలంటే ఈ వీకెండ్ వరకు ఆగాల్సిందే. యుఎస్ ప్రీమియర్స్ పరంగా ఓపెనింగ్స్ పర్లేదు అనిపించినా, 1 మిలియన్ మార్క్ ను చేరుకుంటుందా లేదా అనేది వేచిచూడాలి.
ఏ ప్రాంతంలో ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటికే దాదాపుగా 100కు పైగా ధియేటర్లు మూతపడగా, మరికొన్ని ఆ లైన్ లోనే ఉన్నాయి. ఆ మాటకొస్తే ఒక్క నాని సినిమానే కాదు, గత వారం విడుదలైన అల్లు అర్జున్ “పుష్ప” కూడా బ్రేక్ ఈవెన్ కష్టమనే నిర్ణయానికి ట్రేడ్ వర్గాలు వచ్చేసాయి.



