ఈ నెల 22వ తేదీన విడుదల కానున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ సినిమాను ముందుగా చూసే అదృష్టం, ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పిన గాయకుడు మనోకు దక్కింది. రజనీ పాత్రకు డబ్బింగ్ చెప్పిన మనో, ఈ సినిమాపై మరియు రజనీ అభినయంపై తన మనోభావాలను పంచుకున్నారు. “కబాలి”లో రజనీకాంత్ పర్ఫామ్మెన్స్ చూసి ముగ్ధుడినైపోయానని, అదిరిపోయేలా నటించారని మనో చెప్పిన మాటలు, ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచాయి.
రజనీకాంత్ నటించిన చాలా సినిమాల్లో ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పానని, అయితే “కబాలి” మాత్రం చాలా ప్రత్యేకమని అన్నారు. రజనీకాంత్ నటించిన ఏ సినిమాకైనా తెలుగులో డబ్బింగ్ చెప్పే అవకాశం తనకు లభిస్తుందని, తద్వారా ఆయా చిత్రాలను ముందుగానే చూసే అవకాశం తనకు దొరుకుతుందని, అదే క్రమంలో ‘కబాలి’కి కూడా డబ్బింగ్ చెప్పానని అన్నారు.
డబ్బింగ్ చెప్పేటప్పుడు ‘కబాలి’ సినిమా చూశానని, రజనీకాంత్ స్టైల్ చూస్తుంటే ఆ వయస్సులో ప్రతి వారూ అలా ఉండాలనిపించేలా ఉంటుందని, ఒక్క ఫ్రేమ్ లో కూడా ఆయన స్టైల్ మారలేదని మనో చెప్పారు. ఈ వ్యాఖ్యలతో రజనీ అభిమానులు ఉత్సాహంలో ఉన్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఇతర హీరోలు చేస్తే ‘ఓవర్’ అంటారేమో గానీ, అదే రజనీ చేస్తే మాత్రం ‘స్టైల్’ అంటూ ప్రేక్షకులు కేరింతలు కొడతారు. మరి మనో వ్యాఖ్యలను ప్రేక్షకులు ఏ మేరకు సమర్దిస్తారో ఈ నెల 22వ తేదీన తేలనుంది.



