పాన్ ఇండియాకి విరుగుడు… చిన్న సినిమాలే!

Small Telugu movies and Pan India trend

తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కో దశకం లేదా ఒక్కో ఏడాదిలో ఒక్కో జోనర్‌ నడిచినట్లే, ప్రస్తుతం ‘పాన్ ఇండియా’ మోజు సాగుతోంది.

పెద్ద హీరోలు, దర్శక నిర్మాతలు ‘పాన్ ఇండియా’ వలలో చిక్కుకుపోవడంతో చిన్న సినిమాలకు కాస్త గ్యాప్, ఊరట లభిస్తోంది. దీనిని అవి సద్వినియోగం చేసుకుంటున్నాయనే చెప్పవచ్చు.

ADVERTISEMENT

సరికొత్త ఆలోచనలతో కొత్త దర్శకులు, ఎటువంటి బ్యాగేజీ లేని కొత్త నటీనటులు, తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు… ఈ ‘పాన్ ఇండియా’ పుణ్యమే కదా? కనుక తెలుగు సినీ పరిశ్రమకు ఈ ‘పాన్ ఇండియా’ మోజు మేలు కూడా చేస్తోంది.

ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల తెలుగు మాండలికాలతో వస్తున్న సినిమాలలో రెండు రాష్ట్రాల ప్రజల జీవనశైలి, ముఖ్యంగా గ్రామీణ భాష, సంస్కృతీ సంప్రదాయాలు, కళలను అందరికీ పరిచయం చేస్తున్నాయి.

ఒకప్పుడు తెలుగు సినిమాలలో తెలంగాణ భాషని విలనిజం లేదా కామెడీ పండించడానికి మాత్రమే వాడుకునేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ఉపయోగించుకోవడం చాలా అభినందనీయం.

అదే విధంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, సీమ జిల్లాల మాండలికాలతో పాటు ఆయా ప్రాంతాల ప్రజల జీవనశైలి, స్థానిక పరిస్థితులు, పండుగలు, పబ్బాలు వంటివి చిన్న సినిమాలలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు.

కనుక సినిమా బాగున్నా లేకున్నా ఆయా ప్రాంతాల ప్రేక్షకులు ‘ఓన్’ చేసుకుంటున్నారు. వాటితో బాగా కనెక్ట్ అవుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఇది చాలా మంచి పరిణామమే.

అయితే ప్రేమలు, లిప్ లాకులు, కౌగిలింతలు, మందు కొట్టడం, బూతులు తిట్టడం వంటివి కాలేజీ, పాఠశాల స్థాయికి తీసుకు వచ్చేయడం చాలా ప్రమాదకరమైన ప్రయోగమని చెప్పక తప్పదు.

ఇప్పుడు పెద్దవాళ్ళే పార్టీలు, రాజకీయాలు, కులమతాలు, ప్రాంతాల పేరుతో గాడి తప్పుతున్నప్పుడు, కాలేజీ, టీనేజి, బడికి వెళ్ళే పిల్లలపై ఇటువంటి సినిమాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది కదా? ఇది మంచిదేనా?సినిమాలతో పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదించుకుంటున్నప్పుడు సమాజానికి ముఖ్యంగా భావితరాలను దెబ్బ తీయకూడదు కదా?

కనుక ఇలాంటి సినిమాలు చేస్తున్నవారు, తీస్తున్నవారు కూడా కాస్త సంయమనం పాటిస్తే చిన్న సినిమాలే సినీ పరిశ్రమని ఏలే రోజులు వస్తాయి.

ADVERTISEMENT
Latest Stories