సోషల్ మీడియా పుణ్యమా అంటూ సెలబ్రిటీల జీవితాలను ప్రస్తుతం సామాన్యులు శాశించే విధంగా తయారవుతున్నాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ సెల్ఫీ ఫోటోపై మత ప్రేమికులు మండిపడ్డారు. తన భార్య సఫా బేగ్ తో కలిసి దిగిన ఈ సెల్ఫీ ఫోటోలో ఇర్ఫాన్ చిరునవ్వు చిందిస్తుండగా, సఫా తన కళ్ళు మాత్రమే కనిపించే విధంగా రెండు చేతులను ముఖానికి అడ్డు పెట్టుకుని నవ్వుతోంది. చూడముచ్చటగా ఉన్న ఈ ఫోటోను సోషల్ మీడియాలో ఓ వర్గం టార్గెట్ చేసింది.
ముఖ్యంగా ఇర్ఫాన్ మతాన్ని ప్రస్తావిస్తూ వరుస ట్వీట్లు చేసారు. ముస్లిం యువతివై ఉండి, చేతి వ్రేళ్ళకు నైల్ పాలిష్ వేయడమేంటి..? నైల్ పాలిష్ మతానికి విరుద్ధం అని తెలియదా? అంటుంటే… మరికొందరేమో… మోచేతులు కనిపించే విధంగా డ్రెస్ చేసుకున్నారేంటి? ముస్లింలో చేతుల వరకు ధరించాలని తెలియదా? అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగారు. మరికొందరైతే ముఖం కప్పుకోకుండా బుర్ఖా ఎలా ధరిస్తున్నావు? అంటూ రకరకాల కామెంట్స్ కు నిలయంగా ఈ ఫోటో నిలిచింది.
తన భార్యతో సరదా దిగిన ఓ సెల్ఫీ ఇంతటి రచ్చ చేస్తుందని బహుశా ఇర్ఫాన్ కూడా ఊహించి ఉండరు. ఇటీవల కాలంలో ముస్లిం క్రికెటర్ల భార్యలను మత ప్రేమికులు టార్గెట్ చేస్తున్న వైనం అందరికీ తెలిసిందే. గతంలో మొహమ్మద్ షమీ భార్య ధరించిన కాస్ట్యూమ్స్ పై కూడా అభ్యంతరకమైన రీతిలో నెటిజన్లు స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉదంతంలో షమీ గట్టిగా నిలబడడంతో పాటు, మళ్ళీ మళ్ళీ తనకు ఇష్టమైన ఫోటోలను పోస్ట్ చేసి, అది కేవలం తమ వ్యక్తిగత విషయంగా నెటిజన్లకు తెలిసేలా చేసారు. ఇర్ఫాన్ అయితే సైలెంట్ గానే ఉన్నారు.



