కృష్ణా, కడప, కర్నూల్, ప్రకాశం… లేటెస్ట్ గా శ్రీకాకుళం జిల్లా నేతలు ‘ఫ్యాన్’ తీరు నచ్చక ‘సైకిల్’పై పయనించాలని ‘మూడు’ రంగుల జెండాను పక్కన పెట్టి ‘ఏక’ రంగు జెండా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాలలో 5 జిల్లాలు ఇప్పటికే కవర్ కాగా, మరో 8 జిల్లాలు మిగిలి ఉన్నాయి. ఇలా ‘ఫ్యాన్’ తీరు నచ్చని వారి జాబితా మరో 10 మందికి పైగానే ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్న విషయం. ఆ లెక్కన జిల్లాకోకరు వచ్చినా, రాష్టంలోని అన్ని జిల్లాలు కవర్ అయిపోతాయని సోషల్ మీడియా వేదికగా ‘ఫ్యాన్’పై పడుతున్న సెటైర్లు.
విశేషమేమిటంటే… మిగిలి ఉన్న 8 జిల్లాలతో పాటు, ఇప్పటికే ‘పసుపు’ జెండా పట్టుకున్న వారి జిల్లాలలో కూడా మరికొంతమంది ఈ జెండాను పట్టుకోవాలని ఊవ్విళ్ళూరుతున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ‘ఫ్యాన్’ పవర్ రోజు రోజుకు తగ్గిపోతుందనే ఆందోళన, ఆ ‘ఫ్యాన్’ గాలి పీల్చుకుంటున్న వారిలో వ్యక్తమవుతోంది. అందులోనూ వచ్చేది (మార్చి 28వ తేదీ నుండి) మండే వేసవికాలం కావడంతో… సరిగా గాలి రాకపోతే ఇబ్బంది పడతామని తెలిసి, ఇప్పుడే మారిపోవడం సమంజసమనే భావనలో ఎక్కువమంది ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో తదుపరి జిల్లా అభ్యర్ధి కోసం రాజకీయ వర్గాలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.



