తెలుగు సినిమాకు చెందిన ఏ సినిమా వేడుక అయినా ఎక్కువగా హైదరాబాద్‌లో జరగడం మనం ఇప్పటి వరకు చూశాం. చాలా తక్కువ సందర్బాల్లో మాత్రమే ఇతర ప్రాంతాల్లో జరిగాయి. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు. దాంతో రెండు రాష్ట్రాల ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు, అక్కడ, ఇక్కడ అనే పద్దతిని ఫిల్మ్ మేకర్స్ ఫాలో అవ్వాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఆడియో విడుదల ఇక్కడయితే, సక్సెస్ మీట్ అక్కడ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బాలకృష్ణ తాజా చిత్రం ‘డిక్టేటర్’ ఆడియోను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. బాలకృష్ణతో పాటు గోపీచంద్ కూడా తన ఆడియోను ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు.
గోపీచంద్ హీరోగా రెజీనా హీరోయిన్‌గా రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సౌఖ్యం’ చిత్రం ఆడియోను వచ్చే నెల 13న ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ సినిమాను వచ్చే నెల మొదటి వారంతో పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే ఆడియో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇకపై తెలుగు సినిమాలు వరుసగా ఆడియో వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్నాయి అనేందుకు ఇదే నిదర్శణం. వీరిద్దరి తర్వాత ఏపీలో ఆడియోకు వెళ్లే హీరో ఎవరో చూడాలి.





