ఓవర్సీస్ బాక్సాఫీస్ లో సత్తా చాటుతున్న “నాన్నకు ప్రేమతో” సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ జరుగుతున్నాయి. చిత్ర హీరోహీరోయిన్లతో పాటు సాంకేతిక నిపుణులు కూడా పబ్లిసిటీ ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడుపుతున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కూడా మీడియా ముందుకు వచ్చి “నాన్నకు ప్రేమతో” సినిమా విశేషాలను తెలియజేస్తున్నారు.
“నాన్నకు ప్రేమతో” సినిమా తనకు ఎంతో స్పెషల్ అని చెప్పిన దేవిశ్రీ, ఈ సినిమాకు లభించిన భిన్న స్పందనలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. “నాన్నకు ప్రేమతో సినిమా అర్ధం కాకపోతే ఇక సినిమాలు చూడడం ఆపేయమంటూ” తీవ్రంగా స్పందించడం చర్చనీయాంశమైంది. బహుశా దేవిశ్రీ వ్యక్తిగత కారణాల రీత్యా “నాన్నకు ప్రేమతో” సినిమా ఆయన మనసుకు నచ్చి ఉండవచ్చు గానీ, యూనివర్సల్ గా దేవి చేయాల్సిన ప్రకటన కాదంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి సుకుమార్ ఇచ్చిన స్క్రీన్ ప్లే అర్థవంతంగానే ఉన్నా, హీరో చేత ఆడించిన మైండ్ గేమ్స్ ప్రేక్షకుల “ఐక్యూ”ను పరీక్ష పెడతాయి. ఇంట్రడక్షన్ పాటలో చూపించిన లొకేషన్స్ క్లైమాక్స్ లో విలన్ ను పిచ్చివాడ్ని చేయడానికి చూపించిన విధానం అందరికీ అర్ధమయ్యేది కాదు. ఇలాంటి ట్విస్ట్ లకు “నాన్నకు ప్రేమతో” సినిమాలో కొదవలేదు. మరి టైం పాస్ కోసం సినిమాకు వచ్చే మన తెలుగు ప్రేక్షకులు మూడు గంటల సేపు తీక్షణంగా సినిమా చూడడమంటే అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే “నాన్నకు ప్రేమతో” సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలు లభించాయి.





