మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు లేకుండా ఉంది. మొన్న ఆ మధ్య రాజు గారి గది 3 లాంచ్ చేసినా సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే తప్పుకుంది. రెండు రోజుల క్రితం (అక్టోబరు 2న) విడుదలైన చిరంజీవి సైరా సినిమాలో ఆమె చిన్న పాత్ర చేసింది. అయితే సినిమా విడుదల సమయానికి నయనతార కంటే ఆమెకే విషయం ఉన్న పాత్ర దక్కినట్టు అయ్యింది.
సినిమాలోని టైటిల్ సాంగ్, చివరిలో ఆమె చేసిన ఫైర్ డాన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనితో సిరాతో ఆమెకు మంచి పేరు వచ్చినట్టు అయ్యింది. తమన్నా నటించిన మొదటి తెలుగు సినిమా హ్యాపీ డేస్ 2007లో అక్టోబరు 2నే విడుదల అయ్యింది. ఆ సినిమా తరువాత ఆమెకు వెనక్కు తిరిగి చూసుకునే అవసరమే లేకుండా పోయింది.
ఆ విధంగా అక్టోబరు 2 ఆమెకు బాగా కలిసొచ్చినట్టు అయ్యింది. తమన్నా చేతిలో ప్రస్తుతం గోపీచంద్ సినిమా మాత్రమే ఉంది. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమా నిన్నే లాంచ్ అయ్యింది. నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్తుంది. సైరా సక్సెస్ తో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.
తమన్నా గోపీచంద్ సినిమాలో తెలంగాణ కబడ్డీ అమ్మాయిల జట్టుకు కోచ్ గా కనిపిస్తుంది. ఆ పాత్రలో ఒదిగిపోవడానికి తమన్నా కబడ్డీ నేర్చుకుంటుందట. అలాగే ఆ పాత్రలో తెలంగాణ యాస నేర్చుకుని మరీ సొంతంగా డబ్బింగ్ చెప్పాలని తమన్నా భావిస్తుంది.



