ఏపీలో స్థానిక ఎన్నికల మంటలు రాష్ట్రాన్ని భయపెడుతున్న తరుణంలో గత ఐదేళ్లు అరణ్య రోదనగా మౌన వేదన అనుభవించిన అమరావతిలో మాత్రం పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల హీట్ కనిపిస్తున్నా, రాష్ట్ర రాజధాని అమరావతి లో మాత్రం వాతావరణం పూర్తి ప్రశాంతం గా ఉంది.
రాజధాని నిర్మాణాలు యదావిధిగా సాగుతున్నాయి. ఒకపక్క అమరావతి కి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, మరోవైపు క్వాంటం కంప్యూటింగ్ తో పాటుగా ప్రభుత్వాధికారుల భవన నిర్మాణల పూర్తి, కార్పోరేట్ హోటల్స్ నిర్మాణాలు, అసెంబ్లీ భవనాలు, హై కోర్ట్, ఐకానిక్ టవర్స్ నిర్మాణాల పురోగతి…ఇలా అన్ని పనులు చకచకా ఎటువంటి విరామం లేకుండా ముందుకు సాగుతున్నాయి.
2028 టార్గెట్ గా పూర్తి చెయ్యాల్సిన ప్రతి నిర్మాణాన్ని అనుకున్న సమయానికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నుంచి అధికారుల వరకు అందరు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మరోపక్క అమరావతి ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూ సమీకరణ పనులు మంత్రి నారాయణ నేతృత్వంలో ముందుకు సాగుతున్నాయి.
ఇలా రాష్ట్ర రాజధాని అమరావతి ఎన్నికల వేడి తాపానికి దూరంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. టీడీపీ- జనసేన మధ్య సీట్ల పంచాయితీ గొడవలు లేవు, నువ్వెక్కడ- నేనెక్కడ అనే వాదన లేదు, టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య నామినేషన్ల దాడులు లేవు,
పోలీసుల పహారా కనిపించడం లేదు, మీడియా హడావుడి లేదు, నువ్వా- నేనా అనే భేదాభిప్రాయాలు లేవు, గెలుపోటముల భయం లేదు. ఇలా అమరావతి ప్రాంతం శాంతంగా, ప్రశాంతంగా, ఆహ్లదకరమైన వాతావరణంలో తన లక్ష్యం దిశగా ముందుకు అడుగులు వేసుకుంటూ పోతుంది.





