ప్రస్తుత తరంలో తమిళనాట టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్న సంతానం తండ్రి సి.నీలమేగన్ స్వర్గస్తులయ్యారు. చెన్నైలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న 69 ఏళ్ళ నీలమేగన్ కన్నుమూయడంతో సంతానం కుటుంబం శోకసంధ్రంలో మునిగిపోయింది.
పెద్ద వయసు రీత్యా ఎదురైన ఇబ్బందులతో గత నెల రోజులుగా చెన్నైలోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నీలమేగన్, శుక్రవారం నాడు సాయంత్రం 4 నాలుగు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. శనివారం నాడు సంతానం సొంత ఊరు అయినటువంటి కాంచీపురం జిల్లాలోని పోలిచాలుర్ లో తండ్రి యొక్క అంతిమ కార్యక్రమాలను జరపనున్నారు.
ఒక్క తమిళంలోనే కాక, డబ్బింగ్ ద్వారా వచ్చిన సినిమాలతో తెలుగులోనూ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు సంతానం. అలాగే కమెడియన్ నుండి హీరోగా కూడా ఒకటి, రెండు సినిమాలలో నటించిన సంతానం కుటుంబం, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయింది. ఈ సందర్భంగా సంతానం తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.



