జెండా జనసేనదే…ఏజెండా వైసీపీ దా.?

Balineni and Damacharla political row

టీడీపీ, జనసేన రాజకీయ పొత్తు పై రెండు పార్టీల అధినేతలు ఇప్పటికి పూర్తి స్పష్టత తో ఉన్నారు, అలాగే భవిష్యత్ లో కూడా ఈ ఇద్దరు అధినేతలు ఒక్కటై పొత్తును ముందుకు తీసుకెళ్ళుందుకు సిద్ధంగా ఉన్నట్టు పలుమార్లు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు లో టీడీపీ – జనసేన పార్టీల నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీల నేతలు ఒకరి మీద మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ మిత్ర ధర్మానికి తూట్లు పొడుస్తున్నారు.

ADVERTISEMENT

2024 ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమి తరువాత జనసేన తీర్ధం పుచ్చుకున్న బాలినేని నాటి నుంచి నేటి వరకు కూటమి లో ఇమడలేకపోతున్నారు. ఒంగోలు టీడీపీ నేతలు సైతం బాలినేని జనసేన ఎంట్రీ ని తీవ్రంగా వ్యతిరేకించారు. బాలినేని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ పై అనేక అక్రమ కేసులు పెట్టారని, ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నాడు బాలినేని కి వ్యతిరేకంగా గళం విప్పారు.

అయితే కూటమి పొత్తు ధర్మానికి కట్టుబడి నాటి నుంచి దామచర్ల బాలినేని పై బహిరంగ విమర్శలకు దూరంగా ఉంటున్నారు. అయితే అంతర్గతంగా ఈ రెండు వర్గాల మధ్య రాజకీయ పోరు కొనసాగుతూనే వస్తుంది నేడు తాజా పరిణామాలతో స్పష్టమయ్యింది.

బాలినేని శ్రీనివాస రెడ్డి ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల టార్గెట్ గా విమర్శలు చేసారు. దామచర్ల ‘నేనే రాజు నేనే మంత్రి’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని, ఇసుక దందా చేస్తూ, మద్యం మాఫియాతో చెలరేగిపోతున్నారని, రాజుపాలెం రొయ్యల చెరువు ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ మీడియా సమావేశంలో ప్రకటించారు.

అయితే బాలినేని తన పై చేసిన అవినీతి ఆరోపణల మీద స్పందించిన దామచర్ల బాలినేని పై ఎదురుదాడికి దిగారు. బాలినేని కూటమిలో భాగమైన జనసేన లో ఉండడం వలన ఇన్నాళ్లు ఆయన అవినీతి భాగోతాల గురించి తానూ నోరు విప్పలేదని, ఒకపక్క జాన్సీనాలోనే ఉంటూ తనకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతున్నారని, బాలినేని జనసేన జెండా పట్టుకునప్పటికీ ఇప్పటికి వైసీపీ ఎజెండాతో నే పనిచేస్తున్నారని ఆరోపించారు.

తానూ అవినీతికి పాల్పడుతున్నట్టు బాలినేని ముఖ్య అనుచరుడు కరపత్రాలు వేసి మరి ప్రచారం చేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలిందంటూ, బాలినేని అతని తనయుడి అవినీతి, అక్రమాల గురించి ప్రచారం చెయ్యాలంటే కాగితాలు సరిపోవని, పుస్తకాలే కావాలంటూ బాలినేని పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దామచర్ల.

ఈ ఇరు వర్గాల విమర్శ – ప్రతి విమర్శలతో టీడీపీ – జనసేన మధ్య ఉండే రాజకీయ బంధం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది. నిజంగా దామచర్ల అవినీతికి పాల్పడితే బాలినేని ఆ విషయాన్ని అంతర్గతంగా పార్టీ అధినేతలకు ఆధారాలతో సమాచారం అందిస్తే సరిపోయేది.

అలాకాకుండా బాలినేని నేరుగా మీడియా ముఖంగా ఇలా టీడీపీ ఎమ్మెల్యే పై అవినీతి ఆరోపణలు చేయడం ఒకరంగా టీడీపీ శ్రేణులను రెచ్చకొట్టడమే అవుతుంది. ఇటు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల సైతం బాలినేని తన పై చేసిన కామెంట్స్ ను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి సామరస్యంగా పరిష్కరించుకుంటే వైసీపీ కి ఆహారం లభించేది కాదు.

ఈ ఇరు వర్గాల నేతలు తమ పాత రాజకీయ కక్షలను మనసులో పెట్టుకుని ఇలా పొత్తులో ఉన్న పార్టీలలో ఉంటూ ఒకరి మీద మరొకరు బురద జల్లుకోవడం కూటమి విచ్ఛిన్నానికి నాంది పలికినట్టు అవుతుంది. జనసేన అధినేత పవన్ సైతం బాలినేని ని కట్టడి చెయ్యాల్సి ఉంటుంది. అలాగే ఇటు టీడీపీ అధిష్టానం సైతం దామచర్ల వ్యవహారాన్ని చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది.

టీడీపీ, జనసేన మధ్య రాజకీయ చిచ్చు పెట్టడానికి నిప్పు కోసం పరితపిస్తున్న వైసీపీ కి ఈ మంటలు ప్రాణవాయువు వంటివి. బాలినేని ఇలా టీడీపీ నేత పై బహిరంగ విమర్శలు చేస్తూ జనసేనలో ఉండాలనుకోవడం మాత్రం వైసీపీ రాజకీయ లబ్ది కి తోడ్పాటు అందించడమే అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories