అక్కడ బీజేపీతో ఇక్కడ టిడిపితో పొత్తులు… ఏమిటీ గందరగోళం బ్రో?

NAra-Lokesh-PaWAN

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్రలలో చేసిన ప్రసంగాలను విన్నప్పుడు, ఆయన కుల సంఘాల నేతలను కలుపుకొని ముందుకు సాగుతున్న విధానాన్ని గమనించినప్పుడు రాజకీయంగా చాలా పరిణతి సాధించిన్నట్లే కనిపించారు. అయితే తెలంగాణలో ఎన్నికలు మీద పడేసరికి ఆయన మళ్ళీ అయోమయానికి గురై ప్రజలకు, పార్టీ శ్రేణులను కూడా అయోమయపరుస్తున్నారని చెప్పక తప్పదు.

ADVERTISEMENT

ఏపీలో బీజేపీ, జనసేనలు తెగతెంపులు చేసుకోనందున సాంకేతికంగా వాటి మద్య పొత్తులు కొనసాగుతున్నట్లే. కనుక తెలంగాణలో కూడా బీజేపీతో పొత్తులు పెట్టుకొన్నారని అనుకోవచ్చు. అయితే ఏపీలో బీజేపీతో పొత్తులో ఉండగా టిడిపితో కలిసి పోటీ చేస్తామని చెప్పినందున, బీజేపీకి దూరం అయ్యారనుకొంటే కలిసే ఉన్నామని స్పష్టం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా టిడిపి ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంటే, పవన్‌ కళ్యాణ్‌ బీజేపీకి మద్దతుగా జనసేనని బరిలో దింపారు. అంటే టిడిపి కాంగ్రెస్‌ గెలవాలనుకొంటుంటే, జనసేన బీజేపీ గెలవాలనుకొంటోందన్న మాట! కలిసి పోటీ చేయాలనుకొంటున్న పార్టీలు ఈవిదంగా వ్యవహరిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళవా?

ఏ రాష్ట్ర రాజకీయాలు ఆ రాష్ట్రానికే పరిమితం అని సర్ధిచెప్పుకొన్నప్పటికీ, ఒకవేళ తెలంగాణలో జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలో ఓడిపోతే, ఆ ప్రభావం ఏపీలో కూడా దానిపైన, దానితో పొత్తు పెట్టుకొంటున్న టిడిపిపై కూడా పడుతుంది కదా?ఈ పరిణామాలను వైసీపి తనకు అనుకూలంగా మల్చుకోకుండా ఉంటుందా?అని ఆలోచిస్తే తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం రాజకీయంగా తప్పని అర్దమవుతుంది.

తెలంగాణ రాజకీయాలను పట్టించుకోకుండా ఏపీలో నేడు టిడిపి, జనసేనల రెండో సమన్వయ కమిటీ సమావేశం టిడిపి కేంద్ర కార్యాలయంలో జరుగుతోంది. దీనిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, జనసేన తరపున నాదెండ్ల మనోహర్, ఇరు పార్టీల సీనియర్ నేతలు పాల్గొన్నారు. దీనిలో ఉమ్మడి మ్యానిఫెస్టోపై చర్చిస్తున్నారు. అంటే ఏపీలో టిడిపి, జనసేనల పొత్తులు బలంగా ఉన్నాయని, రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని స్పష్టం అవుతోంది. మరి బీజేపీ?అది కూడా కలుస్తుందనుకొంటే, ఒకవేళ తెలంగాణలో బీజేపీ, జనసేనలు గెలిస్తే పర్వాలేదు కానీ ఓడిపోతే?ఆ ప్రభావం ఏపీలో వారి కూటమిపై పడుతుంది కదా?

ఏది ఏమైనప్పటికీ, ఈ పొత్తులు, ఓటమి వలన జాతీయపార్టీ అయిన బీజేపీకి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు కానీ జనసేన మాత్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఎన్నికల దగ్గర పడుతున్నప్పుడు ఇటువంటి గందరగోళం ఏ పార్టీకైనా నష్టమే.

ADVERTISEMENT
Latest Stories