తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా అధికార పార్టీ వైపుకు మళ్ళుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, టిడిపిల నుండి ఒక్కొక్కరుగా ‘కారు’ ఎక్కుతుండడం ఆయా పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఏపీలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఇప్పటికే గులాభి జెండా పట్టుకోగా, టిడిపికి నమ్మకస్తులుగా ఉన్నటువంటి విజయరామారావు వంటి వారు కూడా కేసీఆర్ పక్షాన చేరడానికి సిద్ధమైపోయారు.
ఈ విషయం తెలుసుకున్న టిడిపి అధినేత చంద్రబాబు స్వయంగా విజయరామారావుకు ఫోన్ చేసి, పార్టీ మారే విషయంలో తొందరపడవద్దని సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో ‘కాస్త సమయం ఇవ్వండి… ఆలోచించి చెబుతానని’ విజయరామారావు బదులిచ్చారట. అయితే మరోవైపు టీఆర్ఎస్ వర్గాల నుండి కూడా రామారావుపై ఒత్తిడి వస్తున్నట్లుగా సమాచారం.
కారెక్కితే మంత్రి పదవి కూడా దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తుండడంతో ఎటూ తేల్చుకోలేని డోలాయమాన పరిస్థితిలో విజయరామారావు ఉన్నట్లుగా పొలిటికల్ వర్గాల టాక్. ఒక వైపు తాను రాజకీయాల్లోకి రావడానికి కారణమైన వ్యక్తి… అందులోనూ ఇటీవల కాలంలో టిడిపిని ఎంతో మంది వీడుతున్నా, కనీసం ఆపే ప్రయత్నం చేయని చంద్రబాబు, తనకు ప్రాధాన్యతనిస్తూ ఫోన్ చేయడం… మరోవైపు ఊరిస్తున్న మంత్రి పదవి… మరి ఈ మాజీ సిబిఐ డైరెక్టర్ ఎటు వైపుకు మళ్లుతారోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే టిడిపికి ఇప్పటికే రాజీనామా లేఖ సమర్పించడంతో టీఆర్ఎస్ లోకి చేరడం ఇక లాంచనమేనని తెలుస్తోంది.





