తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీని బలోపేతం చెయ్యడం మీద దృష్టి పెట్టారు. గతం ఎన్నికలలో ఓటమిని సమీక్ష చేసుకుంటూ జరిగిన పొరపాట్లను సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడి మార్పు మీద కూడా త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు. గత ఎన్నికలలో టీడీపీకి బీసీలను దూరం చేసారని, వారికి మారోసారి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బీసీ వర్గానికి అవకాశం ఇవ్వాలని, అదే సమయంలో పార్టీ పట్ల నిబద్ధత ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ అవకాశం కింజరాపు అచ్చెన్నాయుడుకు అప్పగించేందుకు చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది.
ఏపీ సర్కారు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తనతో సమానంగా తిప్పికొట్టగల నేతగా అచ్చెన్నకు చంద్రబాబు మంచి మార్కులు వేశారు. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ గాలి వీచినా పోటీని తట్టుకొని.. అచ్చెన్నాయుడు మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వారి కుటుంబానికి టీడీపీతో ఉన్న అనుబంధం తెలిసిందే.
అదే సమయంలో అచ్చెన్నాయుడుకి పోటీగా ఆయనతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, అచ్చెన్నాయుడుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొందరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చు.





