ఈ 2025 సంవత్సరం మొదలయ్యే నాటికి భారత అభిమానులకు ఆస్ట్రేలియా సిరీస్ తో ఫుల్ మీల్స్ ఉండనున్నాయనుకున్నారు భారత అభిమానులు. అయితే ఆ ఆశలన్నిటిని అడియాసలు చేస్తూ భారత్ సిరీస్ ను చేజార్చుకోవడమే కాక ఎన్నో విమర్శలను ఎదుర్కోక తప్పలేదు.
జనవరి లో ముగిసిన ఆ టెస్ట్ సిరీస్ తరువాత మరొక టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఏకంగా 6 నెలలు పట్టింది. ఈ సమయంలో భారత జట్టు దిగ్గజాలు విరాట్ కోహ్లీ మరియు కెప్టెన్ రోహిత్ శర్మ తమ టెస్ట్ కెరీర్ కు గుడ్ బాయ్ చెప్పేసారు. యువ రక్తంతో ఇంగ్లాండ్ లో అడుగు పెట్టిన జట్టు పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు.
అయితే అక్కడికెళ్లిన యువకులు మాత్రం దుమ్ములేపే ప్రదర్శన చూపిస్తూ ప్రతి మ్యాచ్ ను చివరి రోజు వరుకు కొనసాగించి ఇంగ్లాండ్ వెళ్లి ఆ జట్టు పై 2-2 తో సిరీస్ ను సమం చేసుకున్నారు. ఆ పై సొంత గడ్డపై టెస్ట్ లలో పసికూన వలె అవతరించిన విండీస్ ను చిత్తు చేశారు.
అసలు సమస్య మొదలయింది ఇప్పుడే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అందుకున్న సౌత్ ఆఫ్రికా జట్టుపై పోరు అంత తేలికగా ఉండదని అనుకుంటూనే ఉండగా, ఆఫ్రికా 2-0 తో హోమ్ గ్రౌండ్ లో వైట్ వాష్ తో అందరిని నిరాశ నిరాశపరిచారు. ఈ సిరీస్ తోనే భారత హెడ్ కోచ్ గంభీర్ పై ట్రోలింగ్ తీవ్ర స్థాయిని అందుకుంది. టెస్ట్ లో గంభీర్ ఆధ్వర్యంలో రెండవ వైట్-వాష్ ను ఎదుర్కొంది.
ఇక, నాణానికి రెండవ వైపు చూసినట్లయితే, 2-0 తో ఘోరంగా ఓడిన అదే జట్టు పై వన్-డే సిరీస్ లో 2-1 తో సిరీస్ ను కైవసం చేసుకోవటమే కాక, ఆధిపత్యాన్ని చూపిస్తూ ఆడిన ఆటతీరు అభిమానులకు కొంత వరుకు ఊరట కలిగించింది. ఆసీస్ పై సిరీస్ ఓడినప్పటికీ చివరి మ్యాచ్లో రో-కో బ్యాటింగ్ షో సిరీస్ కే హైలైట్ గా నిలిచింది.
ఫెబ్రవరీ లో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ ను సైతం వన్-సైడెడ్ గా గెలిచి 3-0 తో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది టీం ఇండియా. ఇక ఆ పిమ్మట జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ లో ఓటమి రుచి ఎరుగకుండా ఫైనల్స్ ను చేరిన టీం ఇండియా, ఫైనల్ లో న్యూజిలాండ్ పై ఆధిపత్యం చూపించి కప్పును ఎగరేసుకుపోయింది.
ఇక టి-20 సిరీస్ ల లో భారత్ ను ఆపటం ఆ పై వాడికి కూడా సాధ్యమయినట్టు కనిపించలేదు. పాల్గొన్న ప్రతి సిరీస్ ను గెలిచి అపోజిషన్ గుండెలో వణుకు పుట్టిస్తుంది భారత్. ప్రత్యేకంగా ‘అభిషేక్ శర్మ’ మన జట్టుకు వన్-మ్యాన్ ఆర్మీ లాగ ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్లను కైవసం చేసుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో 1 స్థానాన్ని ఒడిసిపట్టుకున్నాడు అభిషేక్.
టి-20ల్లో ఇదే ఫామ్ తో ఆసియా కప్పును సొంతం చేసుకుంది భారత్. పాక్ పై అనేక మ్యాచ్లు పడినప్పటికీ ఎప్పటికపుడు వారిని అణగతొక్కుతూనే వచ్చారు. మరి ఇదే ఫామ్ ను కొనసాగించి 2026 ఫెబ్రవరీ లో జరిగే వరల్డ్ కప్ ను కూడా అందుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.
అయితే, 2025 ముగింపు సందర్భంగా క్రికెట్ అభిమానులంతా టెస్ట్ ల లో చేసిన తప్పులు, ఇతర ఫార్మాట్లో గెలిచిన కప్పుల గురించే చర్చించుకుంటున్నారు.







