వైసీపీ చేతికి మట్టి అంటకుండా మనమే కానిచ్చేదామా?

Janasena TDP alliance and Bolisetti Srinivas remarks in Andhra Pradesh politics

ఎన్నికలలో టీడీపితో పొత్తుకు జనసేనలో కొందరు నేతలు, బయట కొందరు శ్రేయోభిలాషులు కూడా వ్యతిరేకించారు. కానీ గత ఎన్నికలలో ఎదురైన చేదు అనుభవం దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్‌ గట్టిగా నిలబడ్డారు. అందువల్లే జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయం సాధించి తొలిసారిగా అధికారంలోకి వచ్చింది.

కానీ జనసేనలో అంతర్గతంగా ఇలాంటి వ్యతిరేకత ఉందని వైసీపీకి బాగా అర్ధమైంది. కనుక అవకాశం చిక్కినప్పుడల్లా జనసేననో లేదా కాపులనో రెచ్చగొట్టి కూటమిలో చిచ్చు రగిలించేందుకు విఫలయత్నాలు చేస్తూనే ఉంది.

ADVERTISEMENT

ఒకవేళ దాని కుట్రలు ఫలిస్తే కూటమి ప్రభుత్వం కూలిపోయి, అమరావతి, పోలవరంతో సహా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు మళ్ళీ ఆటంకం కలిగే ప్రమాదం పొంచి ఉంది.

అందుకే సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ కూటమి ఐఖ్యతను కాపాడేందుకు ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను కట్టడి చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే.

అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ‘వచ్చే ఎన్నికలలో 50-60 సీట్లు సాధించడమే లక్ష్యంగా జనసైనికులు పనిచేయాలని’, ‘టీడీపి నేతలు జనసైనికులను తొక్కేస్తున్నారంటూ’ మాట్లాడిన మాటలు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు కాక, కూటమిలో చిచ్చు రగిలిస్తున్నట్లున్నాయి. జనసైనికులను టీడీపికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నట్లున్నాయి.

టీడీపి నేతలతో ఎదురవుతున్న సమస్యలను మన అధినేత పవన్ కళ్యాణ్‌ సిఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్ళారని చెప్పారు. ఇకపై రాష్ట్రంలో జనసైనికులకు అండగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిలబడతామని, అధికారులు వారికి సాయపడేలా చేస్తామని బొలిశెట్టి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు.

బొలిశెట్టి శ్రీనివాస్ చెపుతున్న ఈ సమస్యలు వాస్తవమే కావచ్చు. ఆయన ఆవేదన సహేతుకమే కావచ్చు. కానీ ఇలాంటి విషయాలు మీడియా ద్వారా బయట పడతాయని, దాని వలన కూటమి ఐఖ్యత దెబ్బ తింటుందని తెలిసి ఉన్నప్పుడు బహిరంగంగా మాట్లాడకూడదు కదా?

టీడీపి శ్రేణులకు కూడా జనసేనపై కొన్ని పిర్యాదులు ఉన్నాయి. కానీ వాటి గురించి చర్చిస్తున్నప్పుడు టీడీపి నేతలు ఏనాడూ తమ అసంతృప్తిని ఈవిధంగా బయటపెట్టుకోలేదు కదా?

ఒక పార్టీలో నేతలు, వారి అనుచరుల మధ్యనే పోటీ, ఘర్షణ వాతావరణం కనిపిస్తున్నప్పుడు, మూడు పార్టీల మద్య ఉండవా?తప్పక ఉంటాయి. కనుక సర్దుబాట్లు, సంయమనం చాలా అవసరం.

ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అధికార పార్టీ ఎమ్మెల్యే ఈవిధంగా మాట్లాడితే జరిగే నష్టం ఊహించగలరా? దానికి అయన బాధ్యత వహిస్తారా?

తాను ఎవరికీ టికెట్లు ఇప్పించలేనని కానీ పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారిని గురించి అధినేత పవన్ కళ్యాణ్‌ చెవిలో వేయగలనని బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. ఆయన ఆ పని చేస్తుంటే జనసేన నేతలు, కార్యకర్తలు చాలా సంతోషిస్తారు.

తొలిసారిగా అధికారంలోకి వచ్చిన జనసేన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ అదే చేస్తున్నారు కదా?

కనుక ఆయన స్పూర్తితో బొలిశెట్టి శ్రీనివాస్ వంటి నేతలు పని చేయాలి. కానీ పార్టీకి, కూటమికి కూడా నష్టం కలిగించే మాటలు దేనికి? అయన మాటలను వైసీపీ అందిపుచ్చుకొని పావులు కదిపితే ఏమవుతుందో ఊహించగలరా?

ADVERTISEMENT
Latest Stories