సాఫ్ట్‌వేర్‌.. అంత సాఫ్ట్‌ కాదట!

Tech Mahindra Employee Alleges Unfair Dismissal

ఒకానొక సమయంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలంటే చాలా గొప్ప. తక్కువ సమయంలో జీవితంలో సెటిల్ అయ్యేవారు కనుక సమాజానికి వారికి చాలా గౌరవం ఉండేది. నేటికీ ఉంది. కానీ వారి పరిస్థితే పూర్తిగా మారిపోయిందిప్పుడు.

ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడుతాయో తెలీని పరిస్థితి. ట్రంప్‌ మొదలు ఏఐ వరకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కానీ ఉద్యోగం పోతే మరొకటి లభించే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. కనుక ఉద్యోగంలో ఉన్నప్పుడూ టెన్షనే… పోయినా ఇంకా టెన్షనే!

ADVERTISEMENT

ఇందుకు తాజా ఉదాహరణగా మేడ్చల్‌లోని టెక్ మహీంద్రా కంపెనీలో పనిచేస్తున్న భావన అనే ఉద్యోగినికి ఎదురైన చేదు అనుభవం, న్యాయం కోసం ఆమె చేస్తున్న పోరాటం గురించి చెప్పుకోవచ్చు.

ఇటీవల తనకు ఆరోగ్యం బాగాలేక ఆఫీసులోనే స్పృహ తప్పి పడిపోతే కనీసం పట్టించుకోలేదని, ఆ తర్వాత వైద్యం చేయించుకోవడానికి రెండు వారాలు సెలవు తీసుకుంటే ఆ సమయంలో కూడా ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరించారని ఆమె వాపోయారు.

ఆరోగ్యం బాగోలేకపోయినా తిరిగి డ్యూటీలో చేరాక, తన పాప ఆరోగ్యం బాగోలేక మూడు రోజులు సెలవు అడిగితే ఉద్యోగం నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

“ఐటి కంపెనీలో మహిళ ఉద్యోగులకు కనీసం గౌరవం లభించడం లేదు. చివరికి వాష్ రూమ్‌కి వెళ్ళాలన్నా మేనేజర్‌కి చెప్పి వెళ్ళాలనేవారు. నాకు మెడికల్ లీవులు ఉన్నాయి. కానీ వాటిని వినియోగించుకోవడానికి వీల్లెదన్నట్లు మాట్లాడేవారు.

మేము వందల మందితో పోటీ పడి ఐటి కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించుకుంటే లోపల ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

అగ్రిమెంట్ ప్రకారం 60 రోజులు నోటీస్ పీరియడ్ ఉండగా మొన్న (జూలై 21) డ్యూటీకి వెళితే ఉద్యోగంలో నుంచి తీసేశామని చెప్పి బయటకు పంపించేశారు.

ఇలాంటి సమస్యలు నేనొక్కదానినే కాదు… కంపెనీలో అందరూ ఎదుర్కొంటున్నారు. కనుక న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాను. అందుకే కంపెనీ ఎదుట ధర్నా చేస్తున్నాను,” అని భావన చెప్పారు. ఇదీ ఐటి కంపెనీ ఉద్యోగుల పరిస్థితి!

ADVERTISEMENT
Latest Stories