
అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా వాటికి ఆర్ధిక పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడే ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలి.
విగ్రహాలు, రంగులు, పేర్లు, ప్యాలస్‌లు, అవసరం లేని సంక్షేమ పధకాలు, ప్రాజెక్టులపై డబ్బు వృధా చేయకూడదు. ప్రచార యావతో వాటి కోసం వందల కోట్ల ప్రజాధనం వృధా చేయకూడదు.
ఆర్ధిక పరిమితులు తెలుసుకోకుండా ఎన్నికలలో గెలిచేందుకు ఎడా పెడా హామీలు ఇవ్వకూడదు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు విలాసాలు, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి… అని చెప్తే ఎవరైనా వింటారా? ఇలాంటి సలహాలు చిన్న పిల్లలకు పాఠాలు చెప్తున్నట్లే అనిపిస్తాయి.
కానీ చేయకూడని ఈ పనులే ప్రభుత్వాలు చేస్తున్నాయి. కనుక నానాటికీ అన్నీ అస్తవ్యస్తంగా మారుతూనే ఉన్నాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇందుకు తాజా నిదర్శనం.
రాష్ట్ర విభజనతో తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరించిందని మాజీ సిఎం కేసీఆర్ స్వయంగా చెప్పుకున్నారు. పదేళ్ళ తన పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని, ఇక మనకు తిరుగేలేదని చెప్పుకున్నారు.
కానీ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు కదా? జీతాల పెంపు డిమాండ్ ఎలాగూ ఉంటుంది. కార్మికులు సంక్షేమ నిధిలో దాచుకున్న డబ్బుని ప్రభుత్వం తిరిగి ఇవ్వాలనే డిమాండ్ కూడా ఒకటి. ధనిక రాష్ట్రానికి ఇదేం ఖర్మ?
ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు! దేనికి? అంటే ఇప్పుడూ జీతాల పెంపు డిమాండ్ ఉంటుంది. పదవీ విరమణ చేసిన కార్మికులకు నెల రోజులలోగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలనే డిమాండ్ కూడా వాటిలో ఒకటి! దీని కోసం కూడా ఉద్యోగులు ప్రభుత్వాలను ఎందుకు అడుక్కోవాల్సి వస్తోంది? అంటే రాష్ట్ర ఆర్ధిక పరిమితులకు అనుగుణంగా ప్రభుత్వం ప్రాధాన్యతలు లేనందునే!
ఆర్ధిక పరిస్థితి బాగోలేదని చెపుతున్నప్పుడు లక్ష కోట్లు పెట్టి మూసీ ప్రాజెక్టు, వందల కోట్లు ఖర్చు చేసి గాంధీ విగ్రహాలు దేనికి? విగ్రహం వద్దని గాంధీజీ మనుమడే చెప్తున్నారుగా?అని ఆర్టీసీ కార్మిక నాయకుడు వెంకన్న ప్రశ్నించారు.
అంటే ఆర్టీసీ కార్మికుల జీతాలు, జీవితాల కంటే ఇలాంటి ప్రాజెక్టులు, విగ్రహాలే ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోందనే కదా అర్ధం?
ఈవిధంగా దాదాపు అన్ని ప్రభుత్వాలు గుడ్డిగా ముందుకు సాగుతుండటం వల్లనే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని చెప్పక తప్పదు.
కనుక ఇప్పటికైనా మారుతారా? అంటే మారరు. కనుక పరిస్థితులూ మారవు. నానాటికీ ఇంకా ఇలాగే పెరుగుతూనే ఉంటాయి. బాధ్యత, జవాబుదారీతనం లేని పాలకులను ఎన్నుకున్నందుకు ప్రజలు భరించాల్సిందే!
There was a time when a release date was announcement in Tollywood it carried real…
Friday saw several films hit theatres, but Fahadh Faasil’s Don’t Trouble the Trouble and Jason…