రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణమే, కానీ ఆ విమర్శలు నానాటికి అసాధారణంగా మారడమే సమాజానికి చేటు చేస్తున్నాయి. రాజకీయాలలో విధాన పరమైన విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శలుగా మారాయి. అలాగే సైద్ధాంతిక విభేదాలను వదిలి వ్యక్తి టార్గేట్డ్ ఆరోపణలు మొదలయ్యాయి.
ఇక నేటి రాజకీయాలలో బూతులు కూడా సర్వసహజమేన విమర్శగానే పరిగణింపబడుతుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మరో స్థాయికి దిగజారాయి అన్నట్టుగా అధికార – ప్రతిపక్షాల మధ్య కుద్రపూజల ప్రస్తావన తెరమీదకు వచ్చింది.
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బిఆర్ఎస్ ముఖ్య నాయకుడు హరీష్ టార్గెట్ గా చేసిన ఈ విమర్శలు సంచలనంగా మారాయి. అరుంధతి సినిమాలో పశుపతి లా హరీష్ వ్యవహరిస్తున్నాడని, రాష్ట్రంలో వర్షాలు పడొద్దు, కరువులు రావాలని,
తెలంగాణలో కాంగ్రెస్ ని గద్దె దింపి తిరిగి అధికారంలోకి రావాలని తాంత్రిక, క్షుద్ర పూజలు చేసేందుకు తిరుచ్చి, శివమొగ్గ వెళ్లారని సమాచారం తమ వద్ద ఉందంటూ మహేష్ గౌడ్ హరీష్ టార్గెట్ గా కుద్రపూజల ఆరోపణలు గుప్పించారు. దీనితో తెలంగాణ రాజకీయ విమర్శల మరోమెట్టు కిందకి జారాయా అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి.
అయితే మహేష్ గౌడ్ విమర్శల పై బిఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ స్పందించారు. హరీష్ కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళితే కాంగ్రెస్ నేతలు ఇలా బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేయడం హిందూ దేవతలను అవమానించడమే అంటూ మహేష్ కుద్రపూజల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు దాసోజ్.
అయితే అధికార – విపక్షాల మధ్య సాగే రాజకీయ విమర్శలు ఇలా క్షుద్ర పూజల వరకు పతనమైతే బాధ్యతాయుత పదవులలో ఉండే నేతలు సమాజానికి ఏం సందేశాన్ని అందిస్తున్నట్టు.? ఇప్పటికే రాజకీయ విమర్శలు కాస్త వ్యకిగత విమర్శల స్థాయికి దిగజారి నేతల మధ్య బూతు విమర్శలు రాజకీయంలో ఒక భాగంగా ఇమిడిపోతున్నాయి.
ఇటువంటి తరుణంలో ఇప్పుడు రాజకీయ నేతల మధ్య విమర్శలు సమాజాన్ని నాశనం చేసే మూఢనమ్మకాల వైపు వెళ్లడం రాజకీయాల లో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




