రాష్ట్రాలు విడిపోతే అభివృద్ధి చెందవచ్చు. కానీ ఓ కుటుంబం విడిపోతే? ఆ కష్టనష్టాలు, బాధ, అశాంతి, అపప్రతిష్ఠ భరించడం… వాటి నుంచి కోలుకోవడం చాలా కష్టం.
అదే విధంగా మన తెలుగు సినీ పరిశ్రమ కూడా నష్టపోతోందని సంగీత దర్శకుడు థమన్ చక్కగా వివరించారు. అఖండ–2 సక్సెస్ మీట్‌లో థమన్ ఏమన్నారంటే, “డిసెంబర్ 5న విడుదల కావలసిన ఈ సినిమాను చివరి రోజున రిలీజ్ కాకుండా అడ్డుకోవడం దారుణం.
ఒకవేళ సమస్యలుంటే ముందుగానే మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు. కానీ సినిమా రిలీజ్ ఆపి దెబ్బ తీయాలనుకోవడం సరికాదు.
మన తెలుగు సినీ పరిశ్రమ శరవేగంగా దూసుకుపోతోందని, దేశంలోనే నం.1 స్థానానికి చేరుకుందని ఇతర ఇండస్ట్రీల వారు చెప్పుకుంటున్నారు. ఈర్ష్య పడుతుంటారు. ఇలాంటి తరుణంలో మనమందరం కలిసికట్టుగా ఉంటూ ముందుకు సాగితే మరింత అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు.
కానీ ఈ విధంగా ఒకరి సినిమాను మరొకరు దెబ్బ తీసుకోవాలనుకోవడం వలన చివరికి మనమే నష్టపోతాము కదా? ఇండస్ట్రీలో ఎవరికి వారు ‘ఇది నా సినిమా, అది వాళ్ల సినిమా’ అనుకుంటారు. కానీ ‘ఇది మన సినిమా’ అనుకొని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి.
ఓ సినిమాకు దెబ్బ తగిలితే అందరూ కలిసి బ్యాండేజ్ వేయాలి. కానీ ఆ గాయాన్ని చూపిస్తూ చాటింపు వేయడం మాత్రం పాపం. ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారే సోషల్ మీడియాలో తప్పుగా కామెంట్స్ చేయడం, సినిమా గురించి దుష్ప్రచారం చేయడం చాలా తప్పు.
తమ వల్ల ఓ సినిమాకు, దాని నిర్మాతకు, ఆ సినిమా కోసం పనిచేసిన వారికి ఎంత బాధ, నష్టం కలుగుతాయో ఆలోచిస్తే ఎవరూ ఇలాంటి పాడు పనులు చేయరు,” అని అన్నారు.
ఓ సినిమా దెబ్బ తింటే దాని వెనుకున్నవారు అందరూ నష్టపోతారు కదా? ఆ ఎదురుదెబ్బ నుంచి కోలుకోవడానికి దర్శక నిర్మాతలు, నటీనటులకు చాలా కష్టం. ఓ సినిమా నష్టపోతే దాని కోసం పనిచేసిన యూనిట్ సభ్యులు మొదలు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు, దానిలో పనిచేసే సిబ్బంది వరకు అందరూ నష్టపోతారు కదా?
ఓ సినిమా దెబ్బ తింటే కొందరికి సంతోషం లేదా పైశాచికానందం కలగవచ్చు. కానీ అంతకుమించి వారికేమీ లభించదు కదా? ఆ సంతోషం కోసం ఇంతమందిని క్షోభ పెట్టడం సమంజసమా? ఏదో రోజు వారందరి ఉసురు తగలకుండా ఉంటుందా?
సినీ పరిశ్రమలోనే అనేకానేక సమస్యలున్నాయి. రాజకీయ నాయకులు, వారి పార్టీలు, ప్రభుత్వాలతో కూడా అనేక సమస్యలున్నాయి. వాటన్నిటినీ పరిష్కరించుకోవడం ఎన్నటికీ సాధ్యం కాదు. అటువంటప్పుడు మళ్లీ ఒకరి సినిమాను మరొకరు దెబ్బ తీసుకుంటూ కొత్త సమస్యలు సృష్టించుకోవడం అవసరమా?
ఇండస్ట్రీలో యూనిటీ లేదు…
ఎవరికైనా దెబ్బ తగిలితే Band-aid వెయ్యండి… అంతే కానీ బ్యాండ్ కొట్టి చెప్పకండి#Akhanda2Thaandavam pic.twitter.com/HjhQmPFmMz
— M9 NEWS (@M9News_) December 14, 2025



