‘సర్కార్ వారి పాట’ ఫస్ట్ సింగిల్ జనవరిలో విడుదల అవుతుందని గత రెండు, మూడు నెలలుగా ఊదరగొట్టిన చిత్ర యూనిట్ చివరికి చేతులెత్తేసింది. జనవరి నెల చివరికి చేరుకోవడం, అధికారికంగా ఇంతవరకు ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో, జనవరి మాసం మహేష్ అభిమానులకు మరో చేదు నెలగా మిగిలిపోనుంది.
అయితే లేటెస్ట్ గా సంగీత దర్శకుడు థమన్ ‘ఫిబ్రవరి 14వ తేదీన’ అంటూ ఊరు, పేరు లేకుండా ఓ ట్వీట్ చేసారు. ‘సర్కార్ వారి పాట’కు సంబంధించిన అప్ డేట్ కదా ఇది? అని సూపర్ స్టార్ అభిమానులు ఈ ట్వీట్ కు రిప్లై ఇచ్చే పనిలో ఉండగా, ఇప్పుడైనా చెప్పిన టైంకు రిలీజ్ చేస్తారో లేదో అన్న సందేహం ఫ్యాన్స్ లో నెలకొంది.
సంక్రాంతి పండగ శుభాకాంక్షలు పోస్టర్ ఎందుకు రిలీజ్ చేయలేదంటే, ‘ప్రొడక్షన్ టీంకు, డిజైనింగ్ టీంకు కరోనా వచ్చిందని’ మైత్రీ సంస్థ ఓ అభిమానికి రిప్లై ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 14వ తేదీన కూడా ‘యూట్యూబ్ అప్ లోడ్ చేసే వారికి కరోనా’ అంటూ ఏదొక సాకు చెప్పి మళ్ళీ అలాంటి పనే చేయరు కదా అంటూ ఫ్యాన్స్ తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.
ఏ సినిమా అప్ డేట్ ఇచ్చినా, కనీసం ఆ సినిమా హ్యాష్ ట్యాగ్ నో, హీరోకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ నో వినియోగించడం చాలా సహజం. కానీ థమన్ చేసిన ట్వీట్ లో ‘ఫిబ్రవరి 14’కు హ్యాష్ ట్యాగ్ పెట్టారు గానీ, సినిమాకు గానీ, హీరోకు సంబంధించినది గానీ చెప్పలేదు. ఇలా ఊరు, పేరు లేకుండా ట్వీట్ చేసేటంత భయం థమన్ లో ఎందుకు నెలకొంది?
ఒకవేళ ముందుగా చెప్పి, ఆ టైంకు రిలీజ్ చేయకపోతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ మైత్రీ సంస్థను ఆడుకున్నట్లే తనను కూడా సోషల్ మీడియాలో ఆడేసుకుంటారన్న భయం నెలకొందా? అంటే ఇప్పటికి కూడా ‘సర్కార్ వారి పాట’ మొదటి సింగిల్ రిలీజ్ పై ఇంకా చిత్ర యూనిట్ కు క్లారిటీ లేదా అన్న ప్రశ్నలకు తావిచ్చేలా థమన్ చేసిన ట్వీట్ ఉంది.



