సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారం ఇలాగేనా?

Tollywood Theatre Crisis

అందరికీ వినోదం పంచే సినీ పరిశ్రమకు ఎప్పుడూ కష్టాలే. ఒకసారి సినీ కార్మికులతో.. మరోసారి థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లతో సమస్యలు. ‘మా’ ఎన్నికలలో నటీనటుల మద్య విభేదాలు బయటపడితే మరోసారి డ్రగ్స్ కేసులలో చిక్కుకొని సమస్యలు.

పైరసీతో ఓ రకం కష్టం కాగా రివ్యూలతో మరో రకం కష్టం. సినిమాలు ఓటీటీలే శాపం… అవే వరం అన్నట్లు మారాయి. ఒకప్పుడు నిర్మాతలు, తర్వాత దర్శకులు, ఆ తర్వాత నటీనటులు సినీ పరిశ్రమని శాశిస్తే ఇప్పుడు ఓటీటీలే సినీ పరిశ్రమని శాశించే స్థాయికి ఎదిగాయంటే సమస్య తీవ్రతని అర్థం చేసుకోవచ్చు.

ADVERTISEMENT

ఇవన్నీ సరిపోవన్నట్లు రాజకీయపార్టీలు, నేతలు, ప్రభుత్వాలతో సమస్యలు వేరేగా ఉంటాయి. ఇన్ని కష్టాలని కెమెరా వెనుక దాచేసి మనకు వినోదం పంచిపెడుతుంటారు.

ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్ధకంగా మారడంతో అద్దెకు బదులు టికెట్ ఆదాయంలో పర్సంటేజ్ అమలు చేయాలని పట్టుబడుతున్నారు.

ఈ సమస్యపై పెద్ద, చిన్న నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు… ఎవరి కోణంలో నుంచి వారు మాట్లాడుతున్నారు. ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పుకుంటున్నారు.

కనుక సినీ పరిశ్రమ చాలా మందికి తెలియని రకరకాల సమస్యలతో ఇబ్బందిపడుతూ ముందుకు సాగుతోందని స్పష్టమవుతోంది.

కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్ల పర్సంటేజ్ విధానానికి పెద్ద నిర్మాతలు అంగీకరించడం లేదు. కనుక ఇకపై పెంచిన టికెట్ రేట్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అనుమతించబోమని వారు తెగేసి చెప్పడంతో ప్రతిష్టంభన నెలకొంది.

టాలీవుడ్‌ లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న ఓ ‘పరిశ్రమ.’ కనుక టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతించి లేదా గద్దర్, నంది అవార్డులతో ప్రభుత్వాలు సరిపెట్టే బదులు, సినీ పరిశ్రమ పర్యవేక్షణ, నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి అవసరమైన తోడ్పాటు అందించగలిగితే సాఫీగా సాగుతుంది.

ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు అందరూ మీడియా ముందుకు ఒకరినొకరు నిందించుకునే పరిస్థితి ఏర్పడకుండా, ఎప్పటికప్పుడు సమస్యలు గుర్తించి పరిష్కరించే యంత్రాంగం ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది కదా?

ADVERTISEMENT
Latest Stories