ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాలీవుడ్ కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. బాహుబలి చిత్రం తరువాత టాలీవుడ్ మూవీస్ పాన్ ఇండియా చిత్రాలుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి. ఇక పుష్ప సినిమాతో బాలీవుడ్ లో తెలుగు సినిమా క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.
పుష్ప మూవీలో పుష్ప క్యారెక్టర్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎంత గుర్తింపు దక్కిందో.. శ్రీవల్లి పాత్రతో రష్మిక మందన్నకు కూడా అదే స్థాయిలో పాన్ ఇండియా స్టార్ డమ్ దక్కింది. ఇలా తెలుగు సినిమా పరిధి పెరుగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ కు ‘కొత్త అందాలు’ పరిచయమవుతున్నాయి.
మొదటి నుంచి కూడా టాలీవుడ్ కొత్త నటీమణులను ప్రోత్సహించడంలో ముందుంటుంది. ఇక ఇప్పుడు కూడా అదే బాటలో తమ తమ కథలకు తగ్గట్టుగా కొత్త నటీమణులను పరిచయం చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో తెలుగు సినిమాల ద్వారా పలువురు కొత్త భామలు తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
హీరో శ్రీకాంత కుమారుడు రోషన్ నటించిన ‘ఛాంపియన్’ మూవీతో మలయాళ భామ ‘అనస్వర రాజన్’ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తాజాగా అనీష్ రెడ్డి డెబ్యూ ‘ఇట్లు అర్జున’ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఇక మరోవైపు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాతో ‘ఇమాన్వి ఇస్మాయిల్’ కథానాయికగా పరిచయం అవుతోంది. అలాగే దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో ‘సాత్విక వీరవల్లి’ కథానాయికగా టాలీవుడ్ లో అడుగుపెట్టారు.
‘అలియాస్ రుక్మిణి’ సినిమాతో ‘ఆఫియా సయాద్’ టాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇదే సినిమాలో కన్నడ నటి ‘చైత్ర జె. ఆచార్’ కూడా కీలక పాత్రలో కనిపించనుంది.
మరోవైపు ప్రియదర్శి హీరోగా రూపొందుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమాతో తెలంగాణ ఫోక్ సింగర్ ‘నాగదుర్గ’ హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇందులో ఆమె శ్రీలత పాత్రలో కనిపించనుంది.
ఇలా ఒక్కో సినిమాతో కొత్త అందాలు టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నాయి. ఇక యానిమల్ తో సెకండ్ హీరోహిన్ గా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయిన ‘త్రిప్తి’.. ప్రభాస్, వంగా కాంబినేషనల్ లో రాబోతున్న ‘స్పిరిట్’ మూవీతో మెయిన్ లీడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అలాగే అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రితిక నాయక్.. మిరాయి, కొరియన్ కనకరాజు మూవీతో మంచి కమర్షియల్ విజయాలు అందుకున్నారు. వీరిలో కొందరు ఇతర భాషల్లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొత్త పరిచయాలే. మరికొందరు పూర్తిగా కొత్తవారే.
అయితే మొదటి అవకాశంతో వెండితెరపై కనిపించడం ఒక ఎత్తయితే.. ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకోవడం మరో ఎత్తు. కేవలం అందం, గ్లామర్ మాత్రమే కాకుండా నటన, పాత్రల ఎంపిక కూడా వారి భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. మరి ఈ కొత్త అందాల్లో టాలీవుడ్‌కు కాబోయే స్టార్ హీరోయిన్ ఎవరు? అనేది రాబోయే సినిమాల విజయాలు తేల్చనున్నాయి.





