తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించి ప్రధానమంత్రి పదవి చేపట్టి దేశాన్ని ఏలాలనే ఆశ పడేవారు. ఆ ప్రయత్నంలో భాగంగా జాతీయ స్థాయి నాయకుడుగా గుర్తింపు సంపాదించుకోవాలనుకున్నారు. రెండూ తప్పు కాదు.
కానీ అందుకోసం టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకోవడం మొదటి తప్పు కాగా, ప్రధాని మోడీపై కత్తులు దూస్తూ, ఆయనను పదేపదే అవమానించడం రెండో తప్పు. ఈ రెండు తప్పులకు అయన చాలా భారీ మూల్యం చెల్లించారు.
కేసీఆర్ పతనం కళ్ళారా చూసిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఆయన బాటలోనే సాగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
అలాగని రేవంత్ రెడ్డికి ప్రధాని కావాలనే కోరిక లేనేలేదు. కానీ తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవాలని గట్టిగా కోరుకుంటున్నారు.
కనుక ఇందిరా, సోనియా, రాహుల్ గాంధీల భజన జోరుగా చేస్తుంటారు. దాని వలన అయన పదవికి భద్రత ఏర్పడుతుంది. కనుక మంచిదే. కానీ రాహుల్ గాంధీ కోసం ప్రధాని మోడీపై కత్తులు దూయాలనుకోవడమే చాలా ప్రమాదకరం.
శుక్రవారం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘సదరన్ రైజింగ్ సమ్మిట్’లో ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. తరచూ విదేశీ యాత్రలు చేసే ఆయనను ‘విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’గా అభివర్ణించారు.
అయన 12 ఏళ్ళ పాలనలో దేశ ప్రజలను కులమతాలు, భాషలు, ప్రాంతాలుగా విడదీసి, దేశ ప్రజలలో ఒక రకమైన భయాన్ని సృష్టించారని అన్నారు. ఆ 12 ఏళ్ళ భయాలను జెన్-జీ కేవలం 12 రోజులలోనే తీసి పడేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
‘ఓట్ చోరీ… గద్దీ చోర్’అంటూ రాహుల్ గాంధీ చేసిన పోరాటాలకు యావత్ దేశ ప్రజలు సంఘీభావం తెలిపారని, అది చూసి ప్రధాని మోడీకి భయం పుట్టిందని అన్నారు.
దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం ఇప్పుడు చాలా అవసరమని, ఆయనను ప్రధానిని చేయడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రధాని మోడీ కంటే రాహుల్ గాంధీ సమర్ధుడు, మంచి నాయకత్వ లక్షణాలు కలిగినవారయితే, ప్రజలే ఆయనకు దేశ పగ్గాలు అప్పగిస్తారు.
కానీ రేవంత్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ పట్ల తమ విధేయత చాటుకోవడానికి, ఆయనను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడమే తమ జీవిత లక్ష్యమని గొప్పగా చెప్పుకుంటున్నారు.
కానీ తమ యువరాజు రాహుల్ గాంధీ గురించి ఈవిధంగా మాట్లాడుతూ ఆయన తన శక్తి సామర్ధ్యాలతో ఆ పదవిని దక్కించుకోలేని ‘అసమర్ధుడు’ అని చెపుతున్నట్లే అనిపిస్తుంది. అటువంటి వ్యక్తి కోసం అత్యంత శక్తివంతుడైన ప్రధాని మోడీపై కత్తులు దూయడం అవసరమా?
కాంగ్రెస్, బిజేపిలు రాజకీయంగా బద్ధ శత్రువులు కనుక వాటి మధ్య రాజకీయ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో పాల్గొన్నా రేవంత్ రెడ్డికి ఎటువంటి నష్టమూ జరుగదు.
కానీ రాహుల్ గాంధీకి పట్టాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టేందుకు ప్రధాని మోడీతో శత్రుత్వం కొని తెచ్చుకోవడం మంచిది కాదు… శాంపిల్ కళ్ళెదుటే ఉంది కదా?





