మనతో చాలాకాలం పాటు ప్రయాణించే సినిమా ఇది: త్రివిక్రమ్

trivikram speech at sir pre release eventసితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు)/‌ ‘వాతి'(తమిళం). ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “గోవిందుడు, గురువు ఎదురైతే మొదటి నమస్కారం నేను ఎవరికి పెట్టాలంటే.. గోవిందుడు వీడు అని చెప్పిన గురువుకే నా మొదటి నమస్కారం పెడతానని కబీర్ అన్నాడు. అలాంటి ఎంతోమంది గురువులకి నమస్కారం చెబుతూ.. అలాంటి గురువుల గురించి సినిమా తీసిన వెంకీని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. లాక్ డౌన్ సమయంలో వెంకీ ఈ కథ చెప్పాడు. అతను చెప్పిన కథని నమ్మి ఈ సినిమా చేసిన ధనుష్ గారికి ధన్యవాదాలు. నిర్మాతల్లో ఒకరైన నా భార్య ఈ సినిమా చూసి.. కథగా విన్నప్పుడు కంటే, సినిమాగా చూసినప్పుడు ఇంకా బాగుంది అని చెప్పింది. నేను కూడా ఈ సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది.

ADVERTISEMENT

ప్రతి కథకి ఒక ఆత్మ ఉంటుంది. ఈ కథ తాలూకు ఆత్మ ఏంటంటే.. విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు డబ్బుతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలనేది ప్రపంచం మనకి నేర్పుతున్న పాఠం. కానీ వాటినే సామాన్య జనాలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. అసలు చదువు ఎందుకు మనిషికి ముఖ్యమంటే.. ఒక మనిషి జీవనశైలిని మార్చగలిగేది చదువు మాత్రమే. ఒక పేదవాడి కొడుకుని డబ్బున్న వాడిని చేయగలిగేది చదువు. ఒక గుమాస్తా కొడుకుని కలెక్టర్ ని చేయగలిగేది చదువు. ఒక మాములు మనిషి కొడుకుని ఒక సుందర్ పిచై, ఒక సత్య నాదెళ్ళ లాంటి స్థాయికి.. ప్రపంచం మొత్తం చూసే స్థాయికి తీసుకెళ్లగలిగేది చదువు. అంత గొప్ప ఆయుధాన్ని కేవలం డబ్బు మీకు లేదని ఒక కారణం మూలంగా వాళ్ళకి దూరం చేయడం ఎంతవరకు రైట్?. ఈ ప్రశ్నే ఈ సినిమాలో వెంకీ అడిగే ప్రయత్నం చేశాడు.

అందుకే ఈ సినిమాకు నాకు చాలా బాగా నచ్చింది. దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాలలో ఉండే వాళ్లకి ఉన్నత చదువులకు వెళ్ళాలంటే అడుగడుగుక్కి చదువు దూరమైపోతుంది. ఇప్పుడైతే ఎల్కేజీ ల నుంచే దూరమవ్వడం మొదలుపెట్టింది. అక్కడి నుంచే గీతలు గీసేస్తున్నాం.. మీకు డబ్బుంది, మీకు డబ్బు లేదు.. మీరు చదువుకోగలరు, మీరు చదువుకోలేరని. చదువుకోవడానికి బుర్ర కాదు, డబ్బు కావాలి అనుకునే స్థాయి మనం వచ్చేశామంటే.. మనం ఎంత దిగజారిపోతున్నామో మనకు తెలుస్తుంది. వీటిని సినిమాలో చాలా బలంగా ప్రశ్నించాడు వెంకీ. నేను చదువుకునే సమయంలో ఇంజనీరింగ్ కోసం ఏడెనిమిది వేలు ఫీజు కట్టాలి. కానీ మా నాన్నగారు డిగ్రీ చదువుకోమని చెప్పడంతో.. నేను పెద్దగా ఏమీ ఆలోచించకుండా, చింతించకుండా డిగ్రీలో చేరాను. కానీ ఈ సినిమాలో ఒక సీన్ చూస్తే.. పిల్లలు ఏదైనా ఒక వస్తువు అడిగినప్పుడు వాళ్ళకి కొనలేకపోతే వాళ్ళు కాసేపే బాధపడతారు. కానీ వాళ్ళ అమ్మానాన్నలు మాత్రం ఆ కొనలేని పరిస్థితి గురించి పోయేవరకు బాధపడతారు అని ఈ సినిమాలో ఒక మాట రాశాడు వెంకీ. నాకు ఇప్పుడు అనిపిస్తుంది.. నేను దాని గురించి పెద్దగా బాధపడలేదు.. కానీ మా నాన్నగారు మాత్రం ఇప్పటికీ మా వాడిని ఇంజనీరింగ్ చదివించలేకపోయానని బాధపడుతూ ఉంటారేమో. మౌలికమైన వసతులు అందరికీ సమానంగా అందాలి.

నేను జల్సా సినిమాలో ఇదే రాశాను. వాళ్ళు ఆసుపత్రికి ఇంత దూరంగా ఉన్నారు, స్కూల్ కి ఇంత దూరంగా ఉన్నారు.. కానీ పేదరికానికి మాత్రం బాగా దగ్గరలో ఉన్నారు. ఇలాంటి సమాజాన్ని మనం ప్రోత్సహించకూడదు. మనకేం కాదు కదా మనం బాగున్నాం కదా అనుకుంటే.. బాగున్నా గ్రూప్ చిన్నదైపోయి, బాగోని గ్రూప్ పెద్దదైతే గనుక.. బాగున్నవాళ్ళు కూడా ఉండరు.. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది 2000లో జరిగిన కథగా చెప్పారు కానీ ఇప్పటికి కూడా సరిగ్గా సరిపోతుంది. టీచర్, స్టూడెంట్ కి మధ్య ఉండే రిలేషన్ చాలా పవిత్రమైనది. మనం ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా మన గురువులు మనతో పాటే ఉంటారు. అలాగే ఈ సార్ సినిమా కూడా మనతో పాటు చాలాకాలం పాటు ప్రయాణించే సినిమా అవుతుంది. ఈ తరం గొప్ప నటుల్లో ధనుష్ ముందు వరుసలో ఉంటాడు. ఆయన జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ పనిని ఎంజాయ్ చేస్తారు. అలా పనిని ఎంజాయ్ చేసేవాళ్ళని ఎవరూ ఆపలేరు. ధనుష్ మొదటి తెలుగు సినిమాలో మేం కూడా భాగమైనందుకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. వెంకీ చాలా మంచి సినిమా చేశాడు. అతనికి ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నాను” అన్నారు.

ADVERTISEMENT
Latest Stories