ఇప్పటివరకు చాలా సినిమాలు చేసినా హీరోగా నితిన్ కు రావాల్సిన క్రేజ్ అయితే రాలేదు. ‘ఇష్క్’ సినిమా తర్వాత వరుసగా విజయాలు అందుకున్నా కూడా నితిన్ కు అంతంత మాత్రపు ఫాలోయింగే దక్కింది. అది కూడా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అన్నది బహిరంగ విషయమే. నిఖిల్ వంటి వారు సైతం తమకంటూ ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్న నేపధ్యంలో, నితిన్ మాత్రం ఈ విభాగంలో విఫలమవ్వడంతో తన తాజా చిత్రం ‘అ…ఆ…’ అయినా ఆశించిన క్రేజ్ ను తీసుకువస్తుందా లేదా అన్న సందేహాలకు ప్రస్తుతం జవాబు దొరికింది.
హీరోలకు ఉండే క్రేజ్ లను లెక్కించడానికి సినీ ఇండస్ట్రీ కొన్ని లెక్కలను పరిగణనలోకి తీసుకుంటుంది. అందులో ఒకటి… టీజర్లకు, ట్రైలర్స్ కు యూట్యూబ్ లో దక్కే క్లిక్స్. ఈ విభాగంలో అయితే నితిన్ అనుకున్న టార్గెట్ ను ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ నూటికి నూరు శాతం పూర్తి చేసారు. ఇటీవల విడుదల చేసిన ‘అ…ఆ…’ ధియేటిరికల్ ట్రైలర్ కు వీక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మళ్ళీ మళ్ళీ చూస్తున్న ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో 1 మిలియన్ (10 లక్షల) క్లిక్స్ ను అందుకుంది.
దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. ‘అ… ఆ…’ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కు అద్దం పడుతున్న ఈ వైనంతో హీరో నితిన్ కూడా సంతోషంలో ఉన్నాడు. త్రివిక్రమ్ రేంజ్ కు ఇలాంటి రికార్డులు పెద్దగా పట్టించుకోకపోయినా, నితిన్ కు మాత్రం చాలా అరుదుగా దక్కే రికార్డు కావడంతో ‘అ…ఆ…’ అన్ని విధాల ఆనందకరమైన అనుభూతులను నితిన్ కు మిగిలుస్తున్నట్లుగా కనపడుతోంది.



