అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాలైన సౌదీఅరేబియా, బహ్రెయిన్, దుబాయ్, అబుదాబీ, కువైట్, ఖతార్‌లకు వ్యాపించింది.
అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ అధ్యక్షుడుతో సహా పలువురు ముఖ్య నేతలను, సైనిక కమాండర్లను మట్టుబెట్టాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో సహా ఇరాన్ సైనిక, వైమానిక, క్షిపణి స్థావారాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి.
అయినప్పటికీ ఇరాన్ ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న గల్ఫ్ దేశాలపై క్షిపణులు విరుచుకుపడుతుంటే ఆయా దేశాల ప్రజలు, ప్రభుత్వాలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
కనీసం 4-5 వారాల పాటు యుద్ధం జరుగవచ్చనే అంచనాతో ప్రారంభించామని, కానీ అంతకంటే ఎక్కువ కాలం కొనసాగినా తమకు ‘బోర్ కొట్టదని’ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా చెప్పారు. అంటే ఇప్పట్లో యుద్ధం ఆగే అవకాశం లేదనే అనుకోవాలి.
గల్ఫ్ దేశాలలో లక్షల మంది భారతీయులున్నారు. అక్కడ వారు, ఇక్కడ వారి బంధుమిత్రులు ఆందోళన చెందుతున్నారు. వెయ్యో పదివేల మందినో అయితే విమానాలు పంపించి వెనక్కు తెచ్చుకోవచ్చు. కానీ లక్షల మందిని వెనక్కు తెచ్చుకోవడం ఏ దేశం వల్లా కాదు.
అయినా ప్రస్తుతం యుద్ధ ప్రభావిత గల్ఫ్ దేశాలకు పౌర విమానాలు పంపడం కూడా కష్టమే. కనుక అందరూ దేవుడిపై భారం వేసి బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే.
అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల ఇప్పటికే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు తీరని నష్టం కలిగింది.
ఇప్పుడు ట్రంప్ మొదలుపెట్టిన ఈ యుద్ధం వలన ముడిచమురు ధరలు… వాటితో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయి. అవి పెరిగితే నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి.
ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారతీయ స్టాక్ మార్కెట్ పదేపదే దెబ్బతింటూనే ఉన్నాయి. అది మెల్లగా కొల్కొన్న ప్రతీసారీ ట్రంప్ ఇలా ఏదో ఓ కొత్త సమస్య సృష్టిస్తూనే ఉన్నారు. దాంతో అవి మళ్ళీ మళ్ళీ పడిపోతూనే ఉన్నాయి.
ఈ యుద్ధ ప్రభావం భారత్, అమెరికాతో సహా ప్రపంచదేశాల ఐటి కంపెనీలపై తీవ్రంగా పడుతుంది. అది ఉద్యోగాల కోతలకు దారితీస్తే దేశంలో నిరుద్యోగం ఇంకా పెరుగుతుంది.
ట్రంప్ దుందుడుకుతనం వలన ఇప్పుడు ప్రపంచంలో యావత్ ముస్లింలు, ముస్లిం దేశాలు అమెరికాపై ఆగ్రహంగా ఉన్నాయి. ఇరాన్ వద్ద సూపర్ సోనిక్, అణ్వాయుధాలున్నాయి. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తోంది కూడా. కనుక ట్రంప్ అమెరికాని కూడా ప్రమాదంలో పడేసినట్లే.
ప్రపంచశాంతి కోసం కృషి చేస్తున్న తనకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుకున్న ట్రంప్, ఈ యుద్ధం అమెరికాతో సహా యావత్ ప్రపంచ దేశాలకు విస్తరించేలా చేస్తున్నారు.







