మద్యం మానేయొచ్చు.. యూపీఐ మానేయగలమా?

UPI Charges Hike in India

వాతలు పెట్టే ముందు ఆ మనిషిని మానసికంగా సిద్ధమైనా చేయాలి.. లేదా వాతలు పెడుతున్నామని తెలుసుకునేలోగానే పని జరిపించేయాలి. మన ప్రభుత్వాలు అవసరం, అవకాశాన్ని బట్టి ఈ రెండు పద్దతులూ వినియోగిస్తుంటాయి.

యూపీఐ ఛార్జీల పెంపుకి మొదటి పద్దతి, పెద్ద నోట్ల రద్దు. లాక్ డవున్ వంటి వాటికి రెండో పద్దతిని అమలుచేశాయి.

ADVERTISEMENT

ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా మొదటి పద్దతిలో దేశ ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తూ యూపీఐ వాతలు తప్పవు.. కానీ అవి పెద్దగా బాధించవని చెప్పారు.

మర్నాడే అంటే నిన్న లోక్‌సభలో యూపీఐ ఛార్జీల పెంపుకి చట్ట సవరణకు ఆమోద ముద్ర వేసింది. కనుక నేడు రాజ్యసభ, రేపు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం లాంచనప్రాయమే. కనుక యూపీఐ వాతలకు అందరూ సిద్ధం కావాల్సిందే.

యూపీఐ వ్యవస్థ ఎల్లప్పటికీ ఉచితంగా సేవలు అందించలేదు. దాని నిర్వహణ ఖర్చులను ఎవరో ఒకరు భరించక తప్పదని ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పారు. ఆయన చెప్పింది అక్షరాల నిజమే. కానీ ఈ భారం సామాన్య ప్రజలపై పడదని, కేవలం పెద్ద వ్యాపారులపై నామమాత్రంగా ఉంటుందని సర్ది చెప్పారు.

కానీ పెద్ద వ్యాపారులపై ఈ భారం పడితే వారు సంతోషంగా దానిని భరించేస్తారా? అంటే కాదని అందరికీ తెలుసు. వారు దానిని చిన్న వ్యాపారులకి బదిలీ చేస్తే, వారు దానిని సామాన్య ప్రజలకు బదిలీ చేస్తారు. ఇదేమీ రహస్యం కాదు.

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగితే ఆ భారమంతా మోస్తున్నది సామాన్య ప్రజలే కదా? ఇదీ అలాగే జరుగుతుంది.

యూపీఐ వాతలు పెట్టిన తర్వాత దేశ ప్రజలు గగ్గోలు పెడతారు. కనుక ఇలాంటి మాటలతో ఆయింట్‌మెంట్ పూస్తున్నారు అంతే!

పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత బదిలీలను ప్రోత్సహించాయి. అవి చాలా సౌకర్యవంతంగా ఉండటంతో దేశప్రజలు దానికి అలవాటు పడ్డారు.

మద్యం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడినవారికయితే డీఎడిక్షన్‌ చేసి అలవాటు తప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ యూపీఐకి అలవాటు పడిన ప్రజలకు అటువంటి వెసులుబాటు ఉండదు.

ఎందుకంటే ఇదివరకులా ఇబ్బడిముబ్బడిగా నగదు (కరెన్సీ) లభ్యత ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా నగదు విత్ డ్రా చేసినా, జమా చేసినా, దాచుకున్నా ప్రతీ దానికి పరిమితులున్నాయి. కనుక రైతు బజారులో ఐదు రూపాయల కరివేపాకు మొదలు పది లక్షల కార్ల వరకు అంతా యూపీఐ ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి.

భారత్‌ వంటి దేశంలో ఈ స్థాయిలో యూపీఐ లావాదేవీలు జరుగుతుండటం చాలా సంతోషం కలిగిస్తుంది. కానీ ఇప్పుడు ఆ సంతోషానికి కాస్త ఖరీదు చెల్లించాల్సి ఉంటుంది. ‘ఆ కాస్త’ ఎంతనేదే కీలకం. ఆ కాస్త క్రమంగా పెరిగి ప్రజలను యూపీఐకి దూరం చేయకుండా ఉంటే చాలు.

ADVERTISEMENT
Latest Stories