ఒక తప్పు చేసినప్పుడు లేదా జరిగినప్పుడు దానిని వెంటనే సరిదిద్దుకుంటే విజ్ఞత. కానీ తెలిసినా సరిదిద్దుకోకుండా మొండిగా ముందుకు సాగితే.. అలాంటి వ్యక్తిని డోనాల్డ్ ట్రంప్ అని పిలవచ్చు. అవును! రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత భారత్‌తో సహా ప్రపంచదేశాలపై ఎడాపెడా సుంకాలు విదిస్తున్నప్పుడే అభ్యంతరాలు, విమర్శలు వెలువెత్తాయి.
అలాగే వీసాల విషయంలో ఆంక్షలు విదిస్తున్నప్పుడు, అమెరికన్ పౌరసత్వం విషయంలో, ఇరాన్‌తో యుద్ధం విషయంలో కూడా ఆయన ఇలాగే విమర్శలు ఎదుర్కొంటున్నారు. కానీ వెనక్కు తగ్గడం లేదు. ఎందుకంటే ఇగో కావచ్చు మరో కారణం కావచ్చు.
కానీ అలాంటి దుందుడుకు వ్యక్తికీ ముక్కుతాడు వేసి కట్టడి చేయవచ్చని అమెరికా సుప్రీంకోర్టు నిరూపించి చూపింది. సుంకాల విషయంలో అయన నిర్ణయాలను తప్పు పట్టిన సుప్రీంకోర్టు, విదేశాల నుంచి ముక్కు పిండి వసూలు చేసిన సుంకాలు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించడంతో ట్రంప్ ప్రభుత్వం సుమారు రూ.9.5 లక్షల కోట్లు దిగుమతిదారులకు వాపసు చేసింది.
యావత్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ట్రంప్‌కి ఇది చెంపదెబ్బ వంటిదే కదా? రేపు ఇరాన్ విషయంలో కూడా ఇలాగే ఎదురుదెబ్బ తగిలినా ఆశ్చర్యం లేదు.
సామాన్య ప్రజలు, అధికారులు, ప్రభుత్వాలు తప్పులు చేయడం సహజమే. కానీ అమెరికా అధ్యక్షుడు వంటి సమున్నతమైన స్థానంలో ఉన్న డోనాల్డ్ ట్రంప్, ఇలా వరుసపెట్టి ఇంత ఘోరమైన తప్పిదాలు చేస్తూ, ప్రపంచ దేశాలకు తీవ్రంగా నష్టం కలిగిస్తుండటమే విచిత్రం.
సుంకాల విషయంలో అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్‌కి ముక్కుతాడు వేయగలిగింది కనుక అదే పూనుకొని ఇరాన్‌తో యుద్ధం కూడా ఆపించ గలిగితే యావత్ ప్రపంచ దేశాలు సంతోషిస్తాయి. ఈ భూమండలంపై ట్రంప్‌ని కట్టడి చేయగల ఏకైక శక్తి అమెరికా సుప్రీంకోర్టు మాత్రమేనేమో?




