రెండు సీట్ల వీసీకే చేతిలో విజయ్‌ భవిష్యత్‌!

VCK Support to Decide Vijay CM Future in Tamil Nadu

తమిళనాడులో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే పార్టీ, 73 సీట్లు గెలుచుకున్న డీఎంకే, 53 సీట్లు గెలుచుకున్న అన్నాడీఎంకే మూడూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతున్నాయి. కానీ కేవలం రెండే రెండు సీట్లు గెలుచుకున్న వీసీకే పార్టీ నిర్ణయించబోతోంది!

అది టీవీకే పార్టీకి మద్దతు ఇస్తే విజయ్‌ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటవుతుంది. లేకుంటే లేదు.

ADVERTISEMENT

ఈరోజు మధ్యాహ్నం వీసీకే పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ పెట్టి తమ నిర్ణయం ప్రకటిస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు. కనుక మూడు ప్రధాన పార్టీల కార్యాలయాలు బోసిపోయి ఉండగా, కేవలం రెండు సీట్లు మాత్రమే కలిగిన వీసీకే పార్టీ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో చాలా హడావుడిగా ఉంది.

టీవీకే పార్టీ 108 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినందున ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా విజయ్‌ గవర్నర్‌ అర్లేకర్‌ని మూడుసార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ శాసనసభలో మొత్తం 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక రాజ్యాంగం ప్రకారం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ఆహ్వానిస్తానని గవర్నర్‌ పదేపదే చెపుతున్నారు.

దీనిపై ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, రాజ్యాంగబద్దంగానే నడుచుకుంటున్నారు కనుక న్యాయపోరాటానికి టీవీకే పార్టీ కూడా వెనకాడుతోంది.

రాజ్యాంగంలో ఈ నిబందనే తమిళనాడులో ఒక్కసారి కూడా ఎన్నికలలో గెలవలేకపోయిన వీసీకే పార్టీని అందలం ఎక్కించింది. ఈ అవకాశాన్ని వాడుకొని అది గొంతెమ్మ కోర్కెలు కోరుతోంది. తమ పార్టీ అధినేత తిరుమలవలన్‌కి ఉప ముఖ్యమంత్రి, కీలకశాఖ మంత్రి పదవులు, విజయ్‌ రాజీనామా చేయబోయే నియోజకవర్గం నుంచి తాము పోటీ చేసేందుకు అంగీకరించాలని వీసీకే పార్టీ షరతులు పెట్టింది.

వీటి గురించి తిరుమలవలన్‌తోనే నేరుగా మాట్లాడేందుకు విజయ్‌ స్వయంగా వీసీకే పార్టీ కార్యాలయానికి చేరుకోవడంతో ఆయన వెంట భారీ సంఖ్యలో టీవీకే పార్టీ కార్యకర్తలు కూడా తరలివచ్చారు. మరికొద్ది సేపటిలో తాడోపేడో తేలిపోతుంది.

ADVERTISEMENT
Latest Stories