తమిళనాడు సిఎం విజయ్‌ని త్రిష అన్ ఫాలో చేసిందా?సమంత గర్భవతి అయిందా?ఆ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా? ఫలానా హీరోయిన్‌కి పుట్టబోయేది కొడుకా కూతురా? వంటి గాసిప్స్ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి.
ప్రజలు కూడా వాటిపై ఆసక్తి చూపుతుంటారు కనుక ప్రింట్ అండ్ డిజిటల్ మీడియాలో కూడా ఇటువంటి గాసిప్స్ నిత్యం వస్తూనే ఉంటాయి.
యాంత్రిక లేదా ఒత్తిళ్ళతో కూడిన జీవితాలు గడిపేవారు కాస్త రిలాక్స్ అవడానికి ఇటువంటి చూడటం సహజం. లేదా సామాన్య ప్రజలకు సహజంగా సెలబ్రిటీల జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి వలన ఇటువంటి ఉపయోగం లేని గాసిప్స్ పై ఆసక్తి చూపుతుంటారు.
తమిళనాడు ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన సిఎం విజయ్, భార్య సంగీతకు విడాకులు ఇస్తుండటం, ఆమెతో విడిపోక ముందే నటి త్రిషతో వైవాహికేతర సంబందం కలిగి ఉండటాన్ని ఇప్పుడు సమాజంలో ఎవరూ తప్పుగా భావించడం లేదు.
ఎందుకంటే ఇది వారి వ్యక్తిగత వ్యవహారం. కనుక వారి నైతికతని ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదని మాజం వారిపట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తుంది.
కానీ వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారా?అందుకే త్రిష సోషల్ మీడియాలో విజయ్‌ని అన్ ఫాలో చేసిందా?అందుకే పుట్టినరోజున విష్ చేయలేదా?అంటూ మళ్ళీ వారి వ్యక్తిగత విషయాలపై అనేక కోణాలలో చర్చిస్తుంటారు.
వారి నైతికతని ప్రశ్నించడం తప్పుగా భావించేవారు వారి అనైతిక బంధంలో ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? అంటే ముందే చెప్పుకున్నట్లు ఇటువంటి గాసిప్స్ ఆనందం కలిగిస్తున్నందున కావచ్చు లేదా సెలబ్రిటీల జీవితాలపై సహజంగా ఉండే ఆసక్తి కావచ్చు.
కొన్ని గంటల తర్వాత త్రిష పెద్ద బర్త్ డే కేక్‌తో విజయ్‌తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అందరూ తమ జీవితాలలోనే పెను తుఫాను నిలిచిపోయినట్లు ‘హమ్మయ్య’ అనుకోని సంతోషపడుతూ మళ్ళీ ఆ ఫోటోకి లైక్స్, కామెంట్స్ చేస్తూ మరో రోజు గడిపేశారు.
దేశం, రాష్ట్రం, చరిత్ర, భాష, సంస్కృతి, సాహిత్యం, కళలు గురించి చాలా మందికి ఆసక్తి ఉండదు. ఎందుకంటే వాటిలో ఇలాంటి స్పైసీనెస్ ఉండదు. పైగా అవన్నీ చాలా హెవీ సబ్జెక్ట్స్. వాటి గురించి తెలుసుకునే అంత ఓపిక, తీరిక ఇప్పుడు ఎవరికీ లేదు. తెలుసుకోకపోయినా హాయిగా జీవితాలు గడిచిపోతున్నాయి.
కనుక ఇలాంటి బ్రేకప్‌లు, రెండో పెళ్ళిళ్ళు, హీరోయిన్ల ప్రెగ్నెన్సీ కబుర్లతో హాయిగా రోజులు దొర్లించేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితులలో ఈవిధంగానైనా జీవితంలో ఒకరోజు సంతోషంగా దొర్లించేయడం మంచిదేనని సరిపెట్టుకోవాల్సిందేనేమో?




