తమిళ రాజకీయాలలోకి టీవీకే పార్టీతో అడుగుపెట్టిన దళపతి విజయ్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది. ఇంకా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెలరోజుల గడువు మాత్రమే మిగిలుంది. అయినా ఇప్పటికి విజయ్ తన కార్యాచరణ మొదలు పెట్టనే లేదు.
అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్న డీఎంకే ఇప్పటికే దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన రాజకీయ పార్టీలుగా క్షేత్ర స్థాయి నాయకత్వంతో బలంగా ఉన్నాయి. ఇక బీజేపీ దశాబ్దాల పోరాటంతో పార్టీ తరుపున నాయకులను బలపరుచుకుంది. ఇటువంటి తరుణంలో 2024 ఫిబ్రవరి 2 న పురుడుపోసుకున్న TVK పార్టీ ఈ మూడు దిగ్గజాలతో ఒంటరి పోరాటం చెయ్యగలదా.?
రెండేళ్ల పసికూన లాంటి విజయ్ TVK దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న పార్టీలతో ఒంటరి రాజకీయంతో ఢీ కొట్టి అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలదా.? రాజకీయాలలో రాజకీయ ఒత్తుడులు ఏ స్థాయిలో ఉంటాయో అనేది తన జననాయకన్ సినిమా విడుదల విషయంలో విజయ్ ప్రత్యక్షంగా చూసారు. దాని ఫలితాన్ని ఇప్పటికి మోస్తున్నారు.
అలాగే ఆ ఒత్తిడులు సీబీఐ కేసుల రూపం లో ఎలా వెంటాడుతాయి అనేది కరూర్ తొక్కిసలాట ఘటనతో ఎదుర్కుంటున్నారు. ఇక రాజకీయాలలో వ్యక్తిగత జీవితం కూడా రాజకీయంతోనే ముడిపడి పోతుందనే విషయాన్ని తన కుటుంబ వివాదాలతో విజయ్ ఈ మధ్యనే తెలుసుకున్నారు.
ఇటువంటి తరుణంలో విజయ్ ఇప్పటికి బీజేపీ తో పొత్తుకు నో అంటూ ముందుకెళితే అది విజయ్ రాజకీయ భవిష్యత్ కి ఏమాత్రం సాయపడగలదు.? అనేది విజయ్ మరోమారు పునరాలోచించుకోవాలి. గతంలో మాదిరి ఇప్పుడు సినీ తారలు రాజకీయ పార్టీలు స్థాపిస్తే అందుకు ప్రజలు వెంటనే ఆమోద ముద్ర వేయడం లేదు. వారి అభిమానుల నుంచి పార్టీకి జై జై లు వస్తున్నాయి కానీ అవి ఓట్లుగా మారడం లేదు.
ఈ విషయం ఇప్పటికి పలుమార్లు నిరూపితమయ్యింది. గతంలో పవన్ కళ్యాణ్ జనసేన తో ఒంటరి పోరు అంటూ ముందుకెళ్ళి పార్టీ ఉనికినే ప్రశ్నించుకునే స్థాయికి పడిపోయారు. ఈ నేపథ్యంలో పవన్ తన అనుభవాన్ని విజయ్ కి ఒక రాజకీయ పాఠంగా భోదిస్తున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
బీజేపీ తో పొత్తు కోసం పవన్ TVK అధినేత విజయ్ తో సంప్రదింపులు జరుపుతున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు ప్రచారమవుతున్నాయి. తాజాగా ఈ విషయం పై స్పందించిన పవన్ తానూ అటువంటి సంప్రదింపులు చేయలేదని, విజయ్ కి ఎటువంటి రాజకీయ సలహాలు, సూచనలు ఇవ్వలేదని, తానూ విజయ్ ని కలిసి సుమారు 25 ఏళ్ళు అయ్యిఉంటుందని స్పష్టం చేసారు.
ఇదిలా ఉంటే మరోవైపు TVK, బీజేపీ తో పొత్తుకు సై అంటే TVK పార్టీకి 80 అసెంబ్లీ సీట్లు, విజయ్ కి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవి అంటూ బీజేపీ లీకులు అందిస్తుంది. ఈ తరుణంలో మరి విజయ్ నిర్ణయం ఎటు వైపు ఉంటుంది అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
అయితే విజయ్ TVK తో తానూ అనుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం అందుకోవడానికైనా, లేదా బీజేపీ తో పొత్తు అంటూ ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకోవడానికైనా, లేక రాజకీయ చదరంగం ముందు సినీ ఛరిష్మా సరిపోదు అని నిరూపించుకోవడానికైనా విజయ్ దగ్గర ఆట్టే సమయం లేదు అనేది గ్రహించాలి.




