దేశభాషలందు తెలుగు లెస్సని శ్రీకృష్ణదేవరాయలవారు ఊరికే సెలవివ్వలేదు. ఈ భాషలో ఉన్న కమ్మదనం అలాంటిది. యాసలు ఎన్ని ఉన్నా ఆత్మ ఒకటే. ఇది సినిమాలకూ వర్తిస్తుంది. మాతృబాషను ఎవరైనా సరే ఇష్టపడకుండా ఉండగలరా. మనమెంత చదువుకున్నా ఇంటికి వచ్చిన అతిథులతో వేరే లాంగ్వేజ్ ని అరువు తెచ్చుకుంటామా. ఏ రాష్ట్రమైనా అక్కడి ప్రజలు ఆయా భాషలను ప్రేమించడం సహజం. ఇప్పుడీ టాపిక్ కి కారణం డబ్బింగ్ చిత్రాల ఆధిపత్యం ఒక్కోసారి స్ట్రెయిట్ సినిమాలనే సవాల్ చేసే స్థాయికి చేరుకోవడం అభిమానులను కలవరపరుస్తోంది. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిల కంటే వారసుడుకే మంచి స్క్రీన్లు వస్తున్నాయనే వార్త ఫ్యాన్స్ ని ఊపేస్తోంది.
సరే దీనికి బాధ్యులు ఎవరంటే కొంచెం లోతుగా వెళ్లాల్సి ఉంటుంది. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కొన్నేళ్ల క్రితం వరకు డబ్బింగులు నిషేధం. రీమేకులు ఎన్ని కావాలన్నా చేసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అనువాదాలు మాత్రం కన్నడ గడ్డ మీద అడుగుపెట్టకూడదనేది వాళ్ళుగా విధించుకున్న స్వీయ నిబంధన. డాక్టర్ రాజ్ కుమార్ గారు ఇది కఠినంగా అమలయ్యేలా చూసుకున్నారు. ఈ కారణంగా మార్కెట్ కుదించుకుపోయినా దీని విషయంలో మాత్రం వెనక్కు తగ్గలేదు. అయిదేళ్ల క్రితం పలు చర్చల తర్వాత దీనికి సడలింపు ఇచ్చేశారు కానీ డబ్బింగులకు పెద్దగా ఆదరణ దక్కడం లేదు. సైరా, ఆర్ఆర్ఆర్, రంగస్థలం లాంటివి తెలుగు వెర్షన్లే శాండల్ వుడ్ లో బాగా ఆడాయి.
ఇక కేరళ విషయానికి వస్తే ఒక్క అల్లు అర్జున్ తప్ప ఇంకెవరికి అక్కడ మార్కెట్ లేదు. వాళ్ళ బిజినెస్ మోడల్ వందల కోట్లలో లేకపోయినా అది పెంచే అవకాశమున్న తెలుగు సినిమాలను లైట్ తీసుకుంటారు. అందుకే డబ్బింగుల ఊసు పెద్దగా ఉండదు ఇక తమిళనాడు సంగతి సరేసరి. మగధీర, శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్లు అరవంలో సోసోగానే ఆడాయి. రజని, విజయ్, అజిత్ లను నెత్తినబెట్టుకున్న స్థాయిలో మన చరణ్ తారక్ బన్నీలను పరిగణించరు. బాహుబలికి మాత్రమే ప్రభాస్ కి మినహాయింపు ఇచ్చారు కానీ తర్వాత తను కూడా అదే లిస్టులో ఉన్నాడు. వాళ్లకు తమిళం మీదున్న మక్కువది. పరిశ్రమ మూలాలు మదరాసులో పుట్టిపెరిగినా తెలుగు సినిమాల ఆదరణ మాత్రం అంతంతమాత్రమే
ఎటొచ్చి మన దగ్గరే మొత్తం రివర్స్. డబ్బింగనే వ్యత్యాసం మనమేనాడూ చూపించలేదు. దానికి తోడు 1980 తర్వాత టాలీవుడ్ ప్రొడ్యూసర్లు రీమేకులకు బదులు అనువాదాల తాకిడి విపరీతంగా చేయడంతో ఆడియన్స్ క్రమంగా వీటికి అలవాటు పడ్డం ఎక్కువయ్యింది. మణిరత్నం సినిమాలు కెఎస్ నరసారెడ్డి, శంకర్ చిత్రాలు ఏఎం రత్నం లాంటి నిర్మాతలు ఇబ్బడిముబ్బడిగా తేవడంతో ఇలాంటివి వంద రోజులు ఆడిన దాఖలాలు చాలానే ఉన్నాయి. మనదగ్గర ఎలాంటి రూల్సూ లేవు. పరిమితంగా విడుదల చేయాలనీ ఏనాడూ డిమాండ్ చేయలేదు. టాప్ ప్రొడ్యూసర్లే డబ్బింగులను మార్కెట్ మీదకు వదులుతుంటే ప్రేక్షకులను నిందించడం వల్ల లాభం లేదు. ఎవరిది సెల్ఫ్ గోలో అర్థం చేసుకోవచ్చు.



