గత వారం రోజులుగా ఉత్కంట రేపిన విశాఖపట్టణం వాసి అదితి ‘కధ’ విషాదంగా ముగిసింది. కన్న తల్లితండ్రులకు, వేచి చూసిన శ్రేయోభిలాషులకు “కన్నీటినే కానుక”గా మిగిల్చి, ఆ చిన్నారి ఎవరికీ అందనంత దూరానికి వెళ్ళిపోయింది. కాదు… కాదు… ఓ రకంగా మన నిర్లక్ష్యపు అధికారం ఆ చిన్నారిని ఈ సమాజం నుండి దూరం చేసింది.
గాలింపు చర్యలు చేపట్టిన నాలుగు రోజులు గడిచిన తర్వాత కూడా అదితి ఆచూకి లభ్యం కాకపోవడంతో జీవీఎంసీ కమీషనర్ ‘తప్పు’ మాది కాదంటూ ఓ ప్రకటన జారీ చేసారు. మునిసిపల్ అధికారులు ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడేం సమాధానం చెప్తారో చూడాలి. నిజానికి ఈ సంఘటన జరిగిన తర్వాత మునిసిపల్ సిబ్బంది తీసుకున్న చర్యలు ప్రశంసించ దగ్గవే. కానీ, ఇవే చర్యలు, ఇంతే చిత్తశుద్ధి ముందే చూపినట్లయితే ఒక ‘అదితి’ కధను చదువుకునే దుస్థితికి మనం వచ్చేవారం కాదు.
విజయనగరం జిల్లా, భోగాపురం మండలం, దిబ్బరాజుపాలెం బీచ్ వద్ద అచేతనంగా పడి వున్న ఆ చిన్నారి తమ గారల పట్టీయేనని తండ్రి శ్రీనివాస్ నిర్ధారించి, అక్కడే కుప్పకూలిపోయాడు. బహుశా, ఆ తండ్రికి ఉన్నంత బాధ కాకపోయినా గత వారం రోజులుగా అదితి కోసం నిరీక్షిస్తున్న ఎన్నో తెలుగు హృదయాలు కన్నీరుతో బరువెక్కాయి. ఈ రాత్రి ఆ కుటుంబానికి కాళరాత్రిగా మిగిలిపోయింది. అదితి గురించిన ప్రతి విషయం వారికి ఇక నుండి ఓ జ్ఞాపకమే… ఓ మధురానుభూతి…
‘అతిధి’లా ఆరేళ్ళ పాటు పలకరించి, పులకరింప చేసిన ‘అదితి’ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అశ్రునయనాలతో…





