విశ్వనాథ్ & సన్స్ రిలీజ్ కి సరిగ్గా ఒక్కరోజు ఉంది. రేపు రాత్రి అమెరికా ప్రీమియర్స్ తో సినిమా సంగతి ఏంటి అనేది అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సినిమా అనౌన్స్ అయినప్పుడు ఇది సూర్య కమ్ బ్యాక్ సినిమా అవుతుంది అని సూర్య అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు కానీ.. కరుప్పు సర్ప్రైజ్ ఇచ్చి ఫ్యాన్స్ ను కుష్ చేసింది.
దాంతో విశ్వనాథ్ & సన్స్ మీద ఉండాల్సిన ఆసక్తి కాస్త కొరవడిందనే చెప్పాలి. అందులోనూ క్లాస్ సినిమా కాబట్టి మాస్ ఆడియన్స్ మామూలుగానే కాస్త దూరంగా ఉన్నారు ఈ సినిమాకి. ట్రైలర్ కూడా బానే ఉంది అనిపించుకుందే తప్ప.. కచ్చితంగా థియేటర్లకి వెళ్లిపోవాలి అనే ఆసక్తి రేకెత్తించలేకపోయింది. అందుకు ప్రస్తుత బుకింగ్స్ నిదర్శనం.
అయితే.. ఈ సినిమా రిజల్ట్ అనేది వెంకీ అట్లూరికి చాలా కీలకం. “సార్, లక్కీ భాస్కర్” లాంటి హిట్స్ తర్వాత వెంకీ “విశ్వనాథ్ & సన్స్”తో హిట్ కొట్టి హ్యాట్రిక్ డైరెక్టర్ గా నిలవగలుగుతాడా? అనే కంటే.. ఈ సినిమాతో వెంకీ తమిళ ప్రేక్షకుల్ని మెప్పించగలుగుతాడా? అనేది పెద్ద ప్రశ్న.
అందుకు కారణం వెంకీ “సార్” సినిమాని తమిళం/తెలుగు భాషల్లో తీసినప్పుడు తమిళ ప్రేక్షకుల నుండి ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. నాగవంశీ కూడా షాక్ అయిన విషయం అది. అందుకే “విశ్వనాథ్ & సన్స్”ను మొదటి నుండి తమిళ సినిమాగా మాత్రమే ప్రమోట్ చేస్తూ వచ్చాడు. అయితే.. ప్రమోట్ చేశాడు సరే, అరవోళ్లకి నచ్చేలా ఆరవ వాసన వచ్చేలా తీయగలిగాడా? లేదా? అనేది ప్రస్తుతం డిబేటబుల్ పాయింట్.
ఒకరిద్దరు తెలుగు ఆర్టిస్టులు సైడ్ రోల్స్ మినహా.. సినిమాలో కీలకపాత్రల్లో ఏ ఒక్క తెలుగు ఆర్టిస్ట్ కనిపించకుండా కేర్ తీసుకున్నా కూడా తమిళోళ్ల అథెంటిసిటీని మ్యాచ్ చేయగలిగాడా? ముఖ్యంగా ఎమోషన్స్ విషయంలో అనేది చూడాలి. మంచి ఫ్యామిలీ డ్రామా సినిమా కాబట్టి.. సెంటిమెంట్ సీన్స్ కోకొల్లలుగా ఉంటాయి, అయితే తమిళ ప్రేక్షకులకు సెంటిమెంట్ లో అతి అనేది చాలా అవసరం. లేదంటే పెద్దగా రియాక్ట్ అవ్వరు. మరి వెంకీ వాళ్ళ టేస్ట్ కి తగ్గట్లుగా విశ్వనాధ్ & సన్స్ ని మలచగలిగాడా? లేదా? అనేది రేపు రాత్రికి తెలిసిపోతుంది.
తెలుగోళ్ల సంగతి అంటారా.. ఎలాగూ మనకి భాషా బేధం లేదు కాబట్టి, సినిమా బాగుంటే చూసేస్తాం. అయితే.. ఆ సినిమా పిచ్చిని తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ కి ఆంధ్రా-తెలంగాణలో మాత్రమే కాక ఓవర్సీస్ లోనూ ఎక్కువ టికెట్ రేట్ పెట్టి వీలైంత ఎక్కువ ఎక్స్ ప్లాయిట్ చేస్తుండడం గమనార్హం. చెన్నై ప్రైమ్ థియేటర్లలో విశ్వనాథ్ & సన్స్ తమిళ వెర్షన్ టికెట్ రేట్ 190 రూపాయల లోపు ఉండగా.. హైదరాబాద్ లో మాత్రం మినిమం 300 రూపాయల నుండి మొదలవుతుంది. తమిళనాడులో కనీసం తెలుగు వెర్షన్ రిలీజ్ కూడా చేయకపోవడం మరో విశేషం.



