కోలీవుడ్‌లో విజయ్ తర్వాత ధనుష్… మరి టాలీవుడ్‌లో ఆఫ్టర్ పవన్?

Dhanush Political Entry Buzz

దక్షిణాదిన సినీ పరిశ్రమకు, రాజకీయ రంగానికి విడదీయలేని అనుబంధం ఉంది. నాటి ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి దిగ్గజాల నుంచి చిరంజీవి, విజయశాంతి…ఇక నేటి తరం స్టార్ హీరోలైన పవన్, విజయ్ కూడా కొత్త రాజకీయ పార్టీలతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు.

అయితే తమిళనాట ‘తళపతి’ విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించగా, తొలి ప్రయత్నంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం అందుకున్నారు. ఇప్పుడు ఆయనే స్ఫూర్తిగా మరో స్టార్ హీరో ధనుష్ కూడా తన రాజకీయ అరంగేట్రానికి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు తమిళ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్నాయి.

ADVERTISEMENT

ధనుష్ ప్రస్తుతానికి నేరుగా పార్టీ ప్రకటన చేయకపోయినా, ఆయన వేస్తున్న అడుగులు మాత్రం పక్కా రాజకీయ వ్యూహాన్ని తలపిస్తున్నాయి. వాటిలో మచ్చుకకు కొన్ని…

సేవా సంఘాల విస్తరణ: తన అభిమాన సంఘాలను ‘ధనుష్ నర్పణి ఇయక్కం’ (సంక్షేమ సంఘం) పేరుతో పునర్వ్యవస్థీకరించి, తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు విస్తరిస్తున్నారు.

విజయ్ ఫార్ములా: రాజకీయాల్లోకి రాకముందు విజయ్ ఎలాగైతే విద్యార్థులకు ఉచిత ట్యూషన్ సెంటర్లు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారో, ధనుష్ కూడా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.

స్థానిక సంస్థలపై కన్ను: 2031 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా, అంతకుముందే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాలని ఆయన వర్గం భావిస్తున్నట్టు వార్తలు చక్కర్లుకొడుతున్నాయి.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పేరుతో దశాబ్ద కాలపు పోరాటం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించి, సినీ హీరోల రాజకీయ ప్రస్థానానికి కొత్త నిర్వచనం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వస్తోంది. కోలీవుడ్‌లో విజయ్ బాటలో ధనుష్ రాజకీయ అడుగులు వేస్తున్నట్లే, టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చే సత్తా, ఆసక్తి ఉన్న స్టార్ హీరో ఎవరు? పవన్ జనసేన మాదిరి తెలుగు రాష్ట్రాల్లో మరో స్టార్ హీరో స్థాపించబోయే పార్టీ ఏది?

అయితే తెలుగు రాజకీయ ముఖచిత్రం తమిళనాడు కంటే భిన్నమైనది. ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలు, సుదీర్ఘ రాజకీయ వారసత్వాలు ఉన్నాయి. అందుకే టాలీవుడ్ హీరోలు రాజకీయాల్లోకి రావడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు.

అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థాయి జనాకర్షణ, రాజకీయ సమీకరణాలు కలిగిన హీరోల జాబితాలో ప్రస్తుతం తారక్ పేరు పదేపదే తెలుగు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంటుంది. ప్రస్తుతానికి టాలీవుడ్ హీరోలందరూ వెండితెరపైనే తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకునే పనిలో ఉన్నారు. అయితే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి, భవిష్యత్తులో ఎవరి గుర్రమైన ఎగరొచ్చు..!

ADVERTISEMENT
Latest Stories