రెండు కేసులలో కదలికలు.. అంటే అర్థం అది కాదు!

Sunil Yadav Viveka murder case

రాజకీయ నాయకులపై కేసులంటే అవి అజ్ఞాతవాసంలో పాండవులు జమ్మిచెట్టుపై దాచి ఉంచిన అత్యంత శక్తివంతమైన అస్త్రాల వంటివే. కనుక అధికారంలో ఉన్నవారు వాటిని అవసరమైనప్పుడు కిందకు దింపి ఉపయోగించుకుంటూ ఉంటారు.

కనుక అవి అటక మీదనే ఉన్నాయంటే ఒక అర్థం.. అటక మీదే అటూ ఇటూ సర్డుతున్నారంటే మరో అర్థం. దుమ్ము దులిపి బల్లపై పెట్టి పరిశీలిస్తున్నారంటే మరో అర్థం ఉంటాయన్న మాట!

ADVERTISEMENT

కనుక ఆ కేసులను, విచారణలను సంబందిత నేరానికి సంబందించినవిగా చూడటం రాజకీయ అజ్ఞానమే అవుతుంది. కొన్ని నెలలో, సంవత్సరాలో కేసులు అటక మీద ఉండిపోవచ్చు. లేదా నత్త నడకన సాగుతుండవచ్చు. అలాంటివాటిని జస్ట్ న్యూస్ ఐటమ్స్‌గా మాత్రమే చూడాలి. ఊరికే ఆవేశపడిపోతే బీపీ పెరుగుతుంది.. అంతే!

కానీ సీబీఐ లేదా ఈడీ నోటీసులు ఇచ్చి పిలుస్తోందంటే 90ఎంఎల్ వేసుకున్నా హాయిగా నిద్రపట్టదు. గుండెపోటుకి గొడ్డలిపోటుకి తేడా కనిపిస్తుంటే అప్రమత్తం అవ్వాల్సిందే!

ఆంధ్రా ప్రజలకు రాజకీయ చైతన్యం కాస్త ఎక్కువే. కనుక ఈపాటికే స్టోరీ అర్థం చేసుకొని ఉంటారు. కనుక క్లుప్తంగా ఈ కేసుల గురించి నాలుగు ముక్కలు చెప్పుకొని, ఈ ‘బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్’ ఏమిటో తర్వాత చూద్దాం.

ముందుగా పురాతనమైన వివేక హత్య కేసులో ఏ-2గా ఉన్న సునీల్ యాదవ్‌కు హటాత్తుగా జ్ఞానోదయం కలగడం, ‘హత్య జరిగిన విధంబు ఎట్టిదనిన…’ అంటూ అతను స్టోరీ మొత్తం పూసగుచ్చినట్లు చెప్పేశారు.

దీనిలో కర్త ఎవరో చెప్పేసి ‘కర్మ, క్రియ’ పార్టులో తనతో సహా వివేకాపై గొడ్డలి ఎత్తినవారి పేర్లు చెప్పేశారు. అయితే ‘నేను బ్రతికి ఉంటేనే సీబీఐ అయినా ఎఫ్‌బీఐ అయినా ఈ కేసులో అసలు దోషులను పట్టుకోగలదు. కనుక నన్ను కాపాడుకునే బాధ్యత మీదేనని డీజీపీకి చెప్పేశారు.

ఇక మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈడీ నోటీస్ మీద నోటీసులు ఇస్తున్నా మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రతీరోజూ రాత్రి 90ఎంఎల్ వేసుకుంటూనే ఉన్నారు. అందువల్ల ఆరోగ్యం పాడుచేసుకొని స్టంట్స్ వేసుకుంటూనే ఉన్నారు. అయినా ఈడీకి చుక్కలు చూపిస్తున్నారు.

వందలసార్లు చూసిన మాస్ మసాలా సినిమాలని దేశ ప్రజలు మళ్ళీ మళ్ళీ చూస్తున్నా క్లైమాక్స్ ఎలా ఉంటుందో అని ఆత్రుత పడినట్లు, ఈ రెండు కేసులలో ఏదో జరిగిపోబోతోందో చూడాలని చాలా మంది ఆత్రపడుతున్నారు. కానీ ఇదేమీ తెలుగు సినిమా కాదు.. తెలుగు టీవీ సీరియల్. దీనిలో ట్విస్టులే తప్ప క్లైమాక్స్ ఉండవు.

కనుక ఇప్పుడు ఆలోచించాల్సింది సునీల్ యాదవ్‌కు హటాత్తుగా ఎందుకు జ్ఞానోదయం కలిగింది?90ఎంఎల్ వేసుకుని పడుకునే అంబటి రాంబాబు వెంట ఈడీ అధికారులు ఎందుకు పడుతున్నారు? అని మాత్రమే.

ముందే చెప్పుకున్నట్లు, ఈ కేసులలో కదలికల వేగం పెరిగితే, అన్నిటిలో ఏ-1గా నిలుస్తున్నవారికి కౌంట్ డౌన్ మొదలైనట్లు. అందుకు గ్రీన్ సిగ్నల్‌ వచ్చినట్లు. వచ్చే ఎన్నికలలో రెడ్ సిగ్నల్ వేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు భావించాలే తప్ప ఈ కేసులు విచారణ పూర్తి చేసేసి నేరస్తులను శిక్షించేసేందుకని ఎవరూ తప్పుగా అనుకోరాదు.

కమర్షియల్ సినిమా కథలాగే ఈ కేసులు, విచారణ, అరెస్టులు, జైలు, బెయిలు అన్నీ రోటీన్. ఇలా లోపలకు వెళ్ళి అలా బయటకు వచ్చేయడమే!

ADVERTISEMENT
Latest Stories