నిన్న కాక మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ వంటి హీరోలు అవలీలగా బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపుతున్నా, అక్కినేని నటవారసత్వం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన నాగచైతన్య మాత్రం ప్రేక్షకులను రంజింపచేయడంలో విఫలమవుతూ రావడం అభిమానులను కలవరపెట్టే అంశంగా మారింది. ‘స్టార్ డం’ కోసం ప్రయత్నించిన ప్రతిసారి అంతకు మించిన రెట్టింపు వేగంతో డౌన్ అవ్వడం జరుగుతోంది.
[m9ad]
‘ఏ మాయ చేసావే, 100% లవ్’లతో బ్యాక్ టు బ్యాక్ క్లాస్ సక్సెస్ లు రావడంతో, ‘మాస్’ ఇమేజ్ కోసం చేసిన ‘దడ, బెజవాడ’ చిత్రాలు దారుణంగా బెడిసికొట్టాయి. ఆ తర్వాత ‘తడాఖా’తో ఓకే అనిపించుకుని, ‘మనం’తో మెమరబుల్ హిట్ అందుకున్న తర్వాత మరో మాస్ ప్రయత్నం ‘ఆటోనగర్ సూర్య’ విఫలమైంది. ఇలా స్టార్ ఇమేజ్ కోసం చేసిన సినిమాలన్నీ చైతూకు డిజాస్టర్ అనుభూతులను మిగిల్చాయి.
ఈ ఏడాదిలో మారుతీతో చేసిన “శైలజారెడ్డి అల్లుడు”తో దశ తిరుగుతుందని భావించగా, ఆ ప్రభావం ఓపెనింగ్స్ పైన మాత్రమే కనిపించింది. దీంతో “సవ్యసాచి” పైనే చైతూ ఆశలు పెట్టుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ కున్న ట్రాక్ రికార్డ్… ‘కార్తీకేయ’ ఫేం చందు మొండేటిలు చైతూ కెరీర్ బెస్ట్ ఇస్తారని ఆశిస్తే… అది కూడా విఫలయత్నంగానే మిగలడం తీవ్ర నిరుత్సాహానికి గురిచేసే అంశంగా మారింది.
‘శైలజా రెడ్డి అల్లుడు’తో పోల్చుకుంటే, ‘సవ్యసాచి’కి ఓపెనింగ్స్ దారుణంగా ఉండడం చైతూ మార్కెట్ ను కలవరపెట్టే విషయంగా మారింది. ఇంత క్రేజీ కాంబో కూడా చైతూకు కావాల్సిన క్రేజ్ తెచ్చిపెట్టలేకపోతే, ‘వాట్ నెక్స్ట్ ఫర్ చైతూ?’ అన్న ప్రశ్న తలెత్తకమానదు. తదుపరి సినిమా శివ నిర్వాన దర్శకత్వంలో సమంత జంటగా చేస్తున్నాడు గానీ, ఇది పక్కా లవ్ స్టోరీ కావడంతో, చైతూకు స్టార్ ఇమేజ్ అయితే దక్కే అవకాశాలు లేవు.



