
పశ్చిమ బెంగాల్ తర్వాత బిజేపి తదుపరి లక్ష్యం తెలంగాణయే అని ప్రధాని మోడీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో స్వయంగా ప్రకటించి వెళ్ళారు.
బిజేపి ఏదైనా ఒక రాష్ట్రంపై దృష్టి పెడితే అక్కడ అధికారంలో వచ్చే వరకు కృషి చేస్తూనే ఉంటుంది. కనుక ప్రధాని మోడీ చెప్పిన ఈ మాటని తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు లైట్ తీసుకుంటే వాటికే నష్టం.
కానీ కర్ణాటక తర్వాత తెలంగాణ ఏమిటి? అంటే అక్కడ ముఖ్యమంత్రి సిద్ద రామయ్యని దించేసి ఆయన స్థానంలో డీకే శివ కుమార్ కూర్చోబోతున్నారు. కనుక అదే స్పూర్తితో తెలంగాణలో కూడా సిఎం రేవంత్ రెడ్డిని దించేసి ఆ కుర్చీలో కూర్చోవాలని పార్టీలో సీనియర్లు ఉబలాటపడవచ్చని అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి.
కానీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ పరిస్థితి వేరు. తెలంగాణలో పరిస్థితి వేరు.
కర్ణాటకలో కాంగ్రెస్‌లో డీకే శివ కుమార్ గ్రూపు రాజకీయాలు చేస్తూ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి సిద్ధరామయ్యని గద్దె దించి సిఎం కాగలుగుతున్నారు.
కానీ తెలంగాణ కాంగ్రెస్‌లో సిఎం రేవంత్ రెడ్డి మాటకు ఎదురు లేదు. మొదట్లో పార్టీలో సీనియర్లు అయన నాయకత్వాన్ని అంగీకరించలేదు. తీవ్రంగా వ్యతిరేకించారు.
కానీ తెలంగాణ ఏర్పడిన పదేళ్ళ వరకు పదవుల కోసం వారిలో వారు కీచులాడుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పీసీసి అధ్యక్షులను ఎంత మందిని మార్చినా వారిలో ఏ ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తేలేకపోయారు. కానీ రేవంత్ రెడ్డి సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూనే, వారినందరినీ ఏకం చేసి కాంగ్రెస్‌ని అధికారంలోకి తెచ్చారు. కనుక సిఎం పదవికి ఆయనే అర్హుడని కాంగ్రెస్ అధిష్టానం కూడా నమ్మి కట్టబెట్టింది.
సిఎం కాకముందు రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్లతో ఎంత సఖ్యతగా ఉండేవారో సిఎం అయిన తర్వాత కూడా వారందరికీ తగిన ప్రాధాన్యం, గౌరవం ఇస్తూ అందరినీ కలుపుకుపోతున్నారు.
నేటికీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్, బిజేపిలు పక్కలో బల్లెంలాగే ఉన్నాయి. కొత్తగా టీఆర్ఎస్ పార్టీ కూడా తయారైంది. కనుక వాటిని కాసుకుంటూ ప్రభుత్వాన్ని నడపడం, వచ్చే ఎన్నికలలో మళ్ళీ వాటిని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం అంత సులువేమీ కాదు.
పార్టీలో సీనియర్లకు మంచి రాజకీయ, పరిపాలనానుభావం ఉన్న మాట నిజం. కానీ ఎన్నికల వ్యూహ రచనలో సిఎం రేవంత్ రెడ్డికి ఎవరూ సాటిరారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేయడం వారి తలకు మించిన పనే. కేవలం సిఎం రేవంత్ రెడ్డి వల్లనే సాధ్యం.
కనుక కాంగ్రెస్ అధిష్టానం అయనకు చాలా ప్రాధాన్యం ఇస్తోంది. ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా పిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు.
కనుక బెంగాల్ తర్వాత తెలంగాణ కావచ్చునేమో కానీ కర్ణాటక తర్వాత తెలంగాణ మాత్రం సాధ్యం కాదు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం అటువంటి ప్రయత్నం చేస్తే అది రాజకీయ ఆత్మహత్యే అవుతుంది.
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…
Vijay’s rise to power in Tamil Nadu has once again brought the spotlight on actors…