కారణాలు ఏవైతేనేమి రాష్ట్రంలో అనేక చిన్న సినిమా థియేటర్లు దివాలా తీసి మూతపడుతున్నాయి. కొన్ని కళ్యాణ మండపాలుగా మారితే కొన్ని గోదాములుగా మారిపోతున్నాయి.
దశాబ్దాలుగా వాటితో అనుబందం పెంచుకున్న ఆయా థియేటర్ల యజమానులు, సిబ్బంది మానసిక క్షోభ ఎవరికీ తెలియదు.
వాటిలో తమ అభిమాన హీరోల సూపర్ హిట్ సినిమాలు ఎన్నెన్నో చూసిన మాస్ ప్రేక్షకులు ఆ థియేటర్లతో ఉన్న మధురానుభూతులు, అనుబందం వారికే తెలుసు. అలాంటి థియేటర్లు వారి కళ్ళ ముందే మూతపడుతుంటే ఏమీ చేయలేని నిసహాయత వారిని ఎంతగా బాధిస్తుందో ఎవరికీ తెలియదు.
తెలుగు సినీ పరిశ్రమ కష్టాలు, సమస్యల గురించి చాలా ఆవేశంగా మాట్లాడి మొసలి కన్నీళ్ళు కార్చే సినీ ప్రముఖులకు ఈ విషయం తెలియదా?
రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలలో ఉండే ఆ చిన్న థియేటర్లలోనే తమ సినిమాలు ఆడుతున్నాయని, అవే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నాయనే తెలియదా?అంటే తెలుసు. కానీ చిన్న థియేటర్లు మూతపడుతుంటే ఏ ఒక్కరూ పట్టించుకోరు. కనీసం స్పందించరు కూడా.
ఎందుకంటే ఇప్పుడు మల్టీ ప్లెక్స్, మల్టీ స్క్రీన్ థియేటర్లు, డాలర్లలో కనక వర్షం కురిపించే విదేశీ మార్కెట్, సినిమా రిలీజ్ కాకముందే చేతిలో కోట్లు పెట్టే ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి కనుక.
వాటన్నిటి ద్వారా మొదటి పది రోజులలోనే అందినకాడికి దండుకోవచ్చు. ఎన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసినా థియేటర్లలో ఆడేది నెల రోజులు.. అంత కంటే తక్కువే. కనుక ఆ నెల రోజులలోనే పిండేసుకుంటున్నారు.
చిన్న థియేటర్లు మూత పడుతుంటే ప్రభుత్వం, సినీ పరిశ్రమ రెండూ పట్టించుకోవడం లేదు. బాధాకరమైన విషయం ఏమిటంటే, నేటికీ సినిమాలు చేస్తున్న గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు ముగ్గురూ కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు. వారు ముగ్గురూ పూనుకుంటే చిన్న థియేటర్లను కాపాడటం పెద్ద కష్టం కాదు.
అయినా పరిశ్రమలు, ఐటి కంపెనీలకు వేల కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పుడు చిన్న థియేటర్లకు ప్రభుత్వం కనీసం చేయూత ఇవ్వలేదా? రాష్ట్రంలో చిన్న థియేటర్లను కాపాడుకునేందుకు సినీ ప్రముఖులు, ప్రభుత్వ పెద్దలు తలో చెయ్యి వేయాలి. చిన్న థియేటర్లు మూతపడితే సామాన్య ప్రేక్షకులు ముఖ్యంగా మాస్ ప్రేక్షక దేవుళ్ళని దూరం చేసుకున్నట్లే అవుతుందని సినీ పరిశ్రమ ఎన్నడూ మరిచిపోకూడదు.
మాస్ ప్రేక్షక దేవుళ్ళ దేవాలయాల వంటి చిన్న థియేటర్లే మూతపడితే ఆ దేవుళ్ళ పరిస్థితి ఏమిటి? ఆ దేవుళ్ళే లేకపోతే గాడ్ ఆఫ్ మాస్‌లు, మాస్ మహారాజులు, మాస్ కా దాసుల పరిస్థితి ఏమిటి? ఆలోచిస్తే బాగుంటుంది.






