తెలిసి త్రివిక్రమ్ అలాంటి పొరపాటు ఎందుకు చేస్తారు

Trivikram Srinivasఒక టైంలో ఒక సినిమాను మాత్రమే చేయగలిగిన పరిస్థితుల్లో స్టార్ హీరోలు, బడా డైరెక్టర్లున్న మాట వాస్తవం. విపరీతంగా పెరిగిన బడ్జెట్లు, మార్కెట్ హెచ్చుతగ్గులు, అభిమానుల అంచనాలు ఇలా కారణాలు ఎన్నెన్నో. గుంటూరు కారం షూటింగ్ లో ఉండగానే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో కొత్త మూవీని ప్రకటించడాన్ని కొందరు తప్పుబట్టడం కామెడీగా ఉంది.

ఇది మహేష్ బాబుని అవమానించడమేనని ఇదేదో ఇంకో మూడు నాలుగు నెలల తర్వాత చేసుకుండాల్సిందని వెరైటీ వెర్షన్ చెబుతున్నారు. ఇదంతా ప్రాక్టికల్ గా ఆలోచించకపోవడం వల్ల వచ్చిన అవగాహన లోపం. ఎందుకంటే ఇలా జరగడం సర్వసాధారణమనే ప్రాధమిక వాస్తవాన్ని మర్చిపోతున్నారు.

ADVERTISEMENT

శంకర్ లాంటి దిగ్గజంతో గేమ్ ఛేంజర్ నిర్మాణంలో ఉండగానే బుచ్చిబాబు కాంబో గురించి రామ్ చరణ్ ప్రకటన ఇవ్వడం తప్పు కాలేదే. సలార్ ప్రొడక్షన్ జరుగుతున్న టైంలో ప్రశాంత్ నీల్ – జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. దేవర కొంత భాగం జరగ్గానే వార్ 2 గురించి చెప్పేశారు. పుష్ప 2 తప్ప ఇంకేవీ ఒప్పుకోవద్దని సుకుమార్ ఏమైనా కండిషన్లు పెట్టాడా లేదే.

అలాంటప్పుడు కేవలం బన్నీ త్రివిక్రమ్ ల వైపే వేలెత్తి చూపడం సబబు కాదు. ఇప్పుడే ఇలా అంటే ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్- కృష్ణల కాలంలో, చిరంజీవి – బాలకృష్ణలు యువకులుగా ఉన్న టైంలో ఒకేసారి మూడు నాలుగు కమిట్ మెంట్లు ఇచ్చి ఓపెనింగ్స్ కూడా చేసేవాళ్ళు. మీడియాకు, అభిమానులకు మెదడు నిండా పనే.

వాస్తవానికి ఇప్పుడు కూడా అలాగే ఉంటే సంవత్సరంలో సగం రోజులు థియేటర్లు నిండీ నిండని ఆడియన్స్ తో ఇబ్బంది పడేవి కాదు. గుంటూరు కారం విషయంలో జరిగిన జాప్యం, పరిణామాలు అన్నీ కళ్ళముందు ఉన్నవే. కోరుకుని చేసుకున్నవి కాదు. అలా జరిగిపోయాయి అంతే. పవన్ కళ్యాణ్ తర్వాత త్రివిక్రమ్ విపరీతంగా ఇష్టపడే హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబులే.

అలాంటప్పుడు వాళ్ళను ఏ రూపంలో అయినా చిన్నబుచ్చే పని ఎందుకు చేస్తారు. అసలు మహేష్ కి మాట మాత్రమైనా చెప్పకుండా తన చిత్తానికి త్రివిక్రమ్ ప్రకటన ఇవ్వరుగా. ఖచ్చితంగా చర్చ జరిగే ఉంటుంది. దానిదేముంది అనుకునే గుంటూరు కారంలో బిజీ అయిపోయి ఉంటారు. సోషల్ మీడియాకో టాపిక్ కావాలి కాబట్టి కొందరు పనిగట్టుకుని ఫ్యాన్స్ మధ్య మంట వేసి చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కాలే చేతులు మహేష్, త్రివిక్రమ్, బన్నీలవి మాత్రం కాదు.

ADVERTISEMENT
Latest Stories