కొన్నికొన్ని సినిమాలు నటులను రాత్రికి రాత్రే స్టార్లను చేసేస్తాయి, ఎక్కడలేని స్టార్ డమ్ ను తెచ్చిపెట్టేస్తాయి. దీంతో అప్పటివరకూ ఒక్క ఛాన్స్… ఒకే ఒక్క ఛాన్స్… అంటూ తిరిగిన నటులకు, కనీసం కొత్త కాల్షీట్ సర్దేందుకు కూడా తీరిక ఉండదు. ప్రస్తుతం తమిళ నటుడు యోగిబాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. నిన్న మొన్నటివరకూ ఆఫర్ల కోసం తీవ్రంగా కష్టపడ్డ యోగిబాబు కోసం ఇప్పుడు నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నారు.
[m9ad]
తమ సినిమాలో నటించాలనీ, కావాల్సినంత పారితోషకం ఇస్తామని చెబుతున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా ఇతివృత్తంగా తెరకెక్కిన కోకో కోకిల (తమిళంలో కొలమావు కోకిల) సినిమాతో యోగిబాబు దశ, దిశ మారిపోయింది. ఈ సినిమాలో నయనతారకు జోడీగా నటించడం, సినిమా హిట్ కావడంతో యోగి బాబుకు భారీగా ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఈ పోరు భరించలేక తన కాల్షీట్ 2020 డిసెంబర్ వరకూ ఖాళీ లేదని యోగి బాబు చెప్పి పంపిస్తున్నాడని కోలీవుడ్ టాక్.
ఇదిలా ఉండగా శ్యామ్ ఆంటన్ దర్శకత్వం వహిస్తున్న ‘గుర్కా’ అనే చిత్రంలోనూ యోగిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. పాత కమెడియన్లకు అవకాశాలు లేక ఇబ్బందులు పడడం… నవతరం కమెడియన్లు ఇలా దూసుకుపోతుండడం… “ఓడలు బండ్లు… బండ్లు ఓడలు…” కావడం అంటే ఇదే కాబోలు..! దీపం ఉండగానే కదా… ఇల్లు సరిదిద్దుకోవాలి… యోగిబాబు కూడా అదే చేస్తున్నట్లున్నారు.



